Vistara: విస్తారా విమానాల రద్దు.. వివరణ కోరిన కేంద్రం

Vistara: విస్తారా విమాన సర్వీసుల ఆకస్మిక రద్దు నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ సంక్షోభానికి కారణాలను ఆరా తీయటంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకుంటున్నారో వెల్లడించాలని ఆ విమానయాన సంస్థను ఆదేశించింది.

Updated : 02 Apr 2024 13:18 IST

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యకలాపాలను తగ్గించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. వారం రోజుల్లో దాదాపు 100కు పైగా సర్వీసులను రద్దు చేయడం వెనకగల కారణాలను వెల్లడించాలని ఆదేశించింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని పౌరవిమానయాన శాఖ కోరింది. దీనిపై వెంటనే స్పందించాలని మంగళవారం నోటీసులు జారీ చేసింది.

‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)’ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. సర్వీసుల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపింది.  

పైలట్లు, చాలా వరకు ఫస్ట్‌ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోనున్నట్లు విస్తారా (Vistara) సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు కాగా.. నేడు ఆ సంఖ్య 70 వరకు ఉంటుందని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాలతో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది.

పైలట్ల అసంతృప్తి..

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌-టాటాల గ్రూప్‌ సంయుక్త సంస్థే విస్తారా. విమానయాన వ్యాపారాలను స్థిరీకరించే ప్రక్రియలో భాగంగా.. తమ సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను టాటా గ్రూప్‌ విలీనం చేస్తోంది. 2022 నవంబరులో ప్రకటించిన విలీన ప్రతిపాదన కింద ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 25.1% వాటా దక్కించుకుంటుంది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంట్లో భాగంగా పైలట్ల పరిహారం విషయంలోనూ ఈ ఏప్రిల్‌ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వస్తోంది.

దీని ప్రకారం.. పైలట్లు ఇకపై 40 పనిగంటలకు మాత్రమే స్థిరమైన వేతనాన్ని పొందుతారు. గతంలో ఇది 70 గంటలుగా ఉండేది. ఇతర టాటా గ్రూప్‌ విమానయాన సంస్థలకు అనుగుణంగా దీన్ని సవరించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మార్పు వల్ల తమ వేతన ప్యాకేజీలో కోత పడుతుందని ఫస్ట్‌ ఆఫీసర్లు, పైలట్లు భావిస్తున్నారు. సీనియారిటీ విషయంలోనూ ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఇది తమ కెరీర్‌ను దెబ్బతీస్తుందని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో సంస్థ హామీ ఇచ్చినప్పటికీ.. ఇంకా వారిలో సందేహాలు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు కొత్త ఒప్పందంపై మార్చి 15లోగా సంతకాలు చేయాలని పైలట్లు, ఫస్ట్‌ ఆఫీసర్లకు విస్తారా గడువు విధించినట్లు తెలుస్తోంది. లేదంటే విలీనానంతర సంస్థలో చేరడానికి సుముఖంగా లేరని భావించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో వారిలో అనుమానాలు మరింత బలపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారంతా అనారోగ్య కారణాలు చెబుతూ మూకుమ్మడిగా సెలవు పెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు