Mineral Assets: విదేశీ ఖనిజాలపై కోల్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ దృష్టి

ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్‌యూ)లైన కోల్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ, ఓఎన్‌జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది.

Updated : 16 May 2024 02:06 IST

ఓఎన్‌జీసీ విదేశీ సైతం

దిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్‌యూ)లైన కోల్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ, ఓఎన్‌జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. ఈ పీఎస్‌యూలకు విదేశాల్లో ఇప్పటికే కార్యకలాపాలు ఉన్నాయని గనుల కార్యదర్శి వీఎల్‌ కాంతారావు బుధవారమిక్కడ గుర్తు చేశారు. ‘చిలీలో కొన్ని లిథియం బ్లాకుల కొనుగోలు విషయాన్ని కోల్‌ ఇండియా పరిశీలిస్తోంది. ఎన్‌ఎమ్‌డీసీకి ఇప్పటికే ఆస్ట్రేలియాలో పసిడి గనులున్నాయి. ఇపుడు అక్కడ లిథియం గనుల వైపు చూస్తోంద’ని కాంతారావు వెల్లడించారు. నాల్కో, హిందుస్థాన్‌ కాపర్‌, మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ కన్సల్టెన్సీ (ఎమ్‌ఈసీఎల్‌)ల సంయుక్త సంస్థ ఖనిజ్‌ బిదేశ్‌ ఇండియా (కాబిల్‌) కూడా విదేశాల్లోని గనులపై దృష్టి పెడుతోంది. ‘చిలీతో ప్రస్తుత విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని విస్తరించాలని భారత్‌ భావిస్తోంది. కీలక ఖనిజాలకు చెందిన చాప్టర్‌ను అందులో జత చేయాలనుకుంటున్నాం. తద్వారా ఈ ఆస్తుల విషయంలో ప్రభుత్వాల మధ్య ఒప్పందాలకు వీలవుతుంద’ని ఆయన వివరించారు. మంగోలియాలో బొగ్గు, రాగి గనులనూ; జాంబియాలో కీలక ఖనిజాలనూ భారత్‌ పరిశీలిస్తోందన్నారు. కాపర్‌, లిథియం, కోబాల్ట్‌, నికెల్‌ వంటి వాటిని గాలి మరల నుంచి విద్యుత్‌ వాహనాల వరకు వాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని