Cognizant Layoffs: ఊడుతున్న ఐటీ కొలువులు.. కాగ్నిజెంట్‌లో 3,500 మందికి ఉద్వాసన!

Cognizant Layoffs: ఐటీలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. మరో 3,500 మందిని తొలగించేందుకు కాగ్నిజెంట్‌ (Cognizant) సిద్ధమవుతోంది.

Updated : 04 May 2023 17:26 IST

Cognizant Layoffs | ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయంగా ఐటీ సంస్థల్లో కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) 3,500 మందికి ఉద్వాసన (Layoffs) పలికేందుకు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ ఎస్‌.రవి కుమార్‌ వెల్లడించారు. అలాగే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 11 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను కూడా వదులుకోనున్నట్లు చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ నికర లాభంలో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 11.2 శాతం అధికం. అయితే, పరిశ్రమలో అత్యల్పంగా 14.6 శాతం మార్జిన్లు మాత్రమే కంపెనీ నమోదు చేసినట్లు తెలిపింది. దీంతో భవిష్యత్‌ అంచనాలను సవరించింది. పూర్తి ఏడాదికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్వాసనలకు (Cognizant Layoffs) సిద్ధమైంది. ఈ మేరకు మొత్తం 3,500 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భారత్‌కు చెందిన వారు ఎంతమంది ఉండబోతున్నారనేది తెలియరాలేదు. వ్యయనియంత్రణలో భాగంగా కొన్ని కార్యాలయాలను కూడా  కాగ్నిజెంట్‌ మూసివేయబోతోంది.

కాగ్నిజెంట్‌ పేరుకే అమెరికా కంపెనీ అయినప్పటికీ.. కార్యకలాపాలు ఎక్కువగా భారత్‌లోనే సాగుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో 3,51,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 2 లక్షల వరకు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12న కాగ్నిజెంట్‌ సీఈఓగా రవి కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈఓగా పనిచేసిన బ్రెయిన్‌ హంఫ్రీస్‌ను అనూహ్యంగా విధుల నుంచి తప్పించడంతో ఆ బాధ్యతలను రవి కుమార్‌ స్వీకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని