LPG Cylinder Price: రూ.25 పెరిగిన వాణిజ్య సిలిండర్‌ ధర

LPG Cylinder Price: వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ సహా విమాన ఇంధన ధరను, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్‌ పన్నును ప్రభుత్వం పెంచింది.

Updated : 01 Mar 2024 15:26 IST

దిల్లీ: హోటళ్లు, రెస్టారంట్‌ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది (Commercial LPG cylinder price hike). దీని ధర దిల్లీలో రూ.1,769.50 నుంచి రూ.25.50 పెరిగి రూ.1,795కు చేరింది. చెన్నైలో రూ.1,960.50, ముంబయిలో రూ.1,749, కోల్‌కతాలో రూ.1,911 అయ్యింది. పెంచిన ధరలు నేటి (2024 మార్చి 1) నుంచే అమల్లోకి వచ్చాయి. ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ యథాతథంగా కొనసాగుతున్నాయి.

పెరిగిన విమాన ఇంధన ధర..

విమాన ఇంధన (ATF) ధరలను సైతం ప్రభుత్వరంగ ఇంధన రిటైల్‌ సంస్థలు శుక్రవారం పెంచాయి. దిల్లీ, కోల్‌కతాలో దేశీయ విమానయాన సంస్థలకు కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1,01,397 నుంచి రూ.8,900 పెరిగి రూ.1,10,297కు చేరింది. ముంబయిలో రూ.98,806గా, చెన్నైలో రూ.1,05,399గా ఉంది. అంతర్జాతీయ సేవలు నిర్వహిస్తున్న దేశీయ విమాన సంస్థలకు ఈ ధరలను దిల్లీలో 921.4 డాలర్లు, కోల్‌కతాలో 959.49 డాలర్లు, ముంబయిలో 919.49 డాలర్లు, చెన్నైలో 916.49 డాలర్లుగా నిర్ణయించారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే కావడం గమనార్హం. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా వీటి ధరల్లో మార్పులు చేస్తుంటారు.

విండ్‌ఫాల్‌ పన్నూ పైపైకే..

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్నును (Windfall Tax) ప్రభుత్వం పెంచింది. టన్నుకు ప్రస్తుతం రూ.3,300 ఉండగా దాన్ని రూ.4,600 చేసింది. డీజిల్‌ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.1.50 ఉండగా.. ప్రస్తుతం దాన్ని సున్నా చేసింది. ఏటీఎఫ్‌, పెట్రోలు ఎగుమతులపైనా  ఎలాంటి పన్ను లేదు. కొత్త పన్ను రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి 15 రోజులకోసారి విండ్‌ఫాల్‌ పన్నులో ప్రభుత్వం మార్పులు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని