Income Tax: పన్ను చెల్లింపుదారులకు చిదంబరం సూచన!

Income Tax: బడ్జెట్‌లో పన్ను విధానంలో ప్రతిపాదించిన మార్పులపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శలు చేశారు. 

Published : 02 Feb 2023 12:37 IST

దిల్లీ: బడ్జెట్‌ 2023 (Budget 2023)లో ఆదాయ పన్ను (Income Tax) విధానంలో పలు మార్పుల నేపథ్యంలో వివిధ వర్గాల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త, పాత పన్ను విధానాల పేరిట ప్రభుత్వం హడావుడి సృష్టించిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. తద్వారా ప్రజల వ్యక్తిగత పొదుపు ప్రాధాన్యాన్ని విస్మరించిందని ఆరోపించారు. మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతున్న తరుణంలో వ్యక్తిగత పొదుపే వారికి సామాజిక భద్రత అని వ్యాఖ్యానించారు. 

పలు వార్తాపత్రికల్లో ఆదాయపన్ను (Income Tax) విధానంపై వచ్చిన కథనాలు, విశ్లేషణనల ఉటంకిస్తూ.. కొత్త విధానంలో ఉన్న రహస్యం బయటపడుతోందని చిదంబరం వ్యాఖ్యానించారు. పన్ను చెల్లింపుదారులు తొందరపడి సొంతంగా ఎలాంటి నిర్ణయానికి రావొద్దని సూచించారు. సరైన లెక్కలు వేసుకోవాలన్నారు. అవసరమైతే ఛార్టెడ్‌ అకౌంటెంట్లను సంప్రదించాలన్నారు. పన్ను విధానం సంక్లిష్టంగా ఉందని ఆయన అన్యాపదేశంగా అభిప్రాయపడ్డారు.

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దును చిదంబరం బుధవారం కఠోరమైన బడ్జెట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. సామాన్యుల అవసరాలు ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వంపై భరోసా పెట్టుకున్న ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సమాజంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, అసమానతల వంటి పదాల జోలికి కూడా మంత్రి వెళ్లలేదన్నారు. ‘పేద’ అనే మాట దయతో రెండుసార్లు ఉచ్చరించారని వ్యాఖ్యానించారు. ఇతర వాణిజ్య, ఆర్థిక కేంద్రాల నోళ్లు కొట్టి అహ్మదాబాద్‌ను ‘గిఫ్ట్‌ సిటీ’గా మారుస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని