వసూళ్లు 27%.. వదులుకుంది 73%

నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Updated : 18 May 2024 01:34 IST

2023-24 దివాలా ప్రక్రియల్లో రుణ సంస్థల పరిస్థితి ఇది: ఇక్రా

దిల్లీ: నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకులు-ఇతర ఆర్థిక సంస్థలు ఇస్తున్న రుణ మొత్తంతో పోలిస్తే, దివాలా పరిష్కార ప్రక్రియ కింద వసూలవుతున్న మొత్తం నాలుగో వంతుకు పరిమితం కావడం ఇందుకు కారణం. 2022-23లో ప్రతి రూ.100 బకాయిల్లో, ఆర్థిక సంస్థలు దివాలా ప్రక్రియ కింద రూ.64 వదులుకోగా, 2023-24లో ఈమొత్తం మరింత అధికమై రూ.73 పోగొట్టుకున్నట్లు రేటింగ్‌ సంస్థ ఇక్రా తెలిపింది. 

  • 2022-23లో రుణ సంస్థలకు రావాల్సిన బకాయిల్లో సగటున 36 శాతం రాగా, 2023-24లో ఇది 27 శాతానికి పరిమితమైనట్లు సంస్థ నివేదిక వెల్లడించింది.
  • 2023-24లో మొత్తంగా 269 దివాలా పరిష్కార ప్రక్రియలకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునళ్లు  ఆమోదం తెలిపాయి. 2022-23లో ఈ సంఖ్య 189గా ఉంది. 
  • కొత్తగా దాఖలైన దివాలా పరిష్కార దరఖాస్తుల సంఖ్య 2022-23లోని 1,263తో పోలిస్తే 2023-24లో 987కు తగ్గింది. 
  • కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో, పలు కారణాల రీత్యా రుణ సంస్థలు తమకు రావాల్సిన మొత్తం బకాయిల నుంచి కొంత మొత్తాన్ని వదులుకోవడం లేదా త్యాగం చేయక (హెయిర్‌కట్‌) తప్పట్లేదు. ఈ మొత్తం మరీ ఎక్కువగా ఉంటుండటంపైనే ఆందోళన వ్యక్తమవుతోందని ఇక్రా హెడ్‌ (స్ట్రక్చర్డ్‌ ఫైనాన్స్‌ రేటింగ్స్‌) అభిషేక్‌ డాఫ్రియా తెలిపారు. 

జాప్యం వల్లే: దివాలా స్మృతి ప్రకారం.. దివాలా పరిష్కార ప్రక్రియను 330 రోజుల్లో పూర్తి చేయాలి. అయితే దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తికి పడుతున్న సమయం 2023-24లో సగటున 843 రోజులకు పెరిగింది. న్యాయ వివాదాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల్లో, భారీమొత్తాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ఈ పరిణామమూ ఓ కారణమని ఇక్రా తెలిపింది. 2024-25లోనూ రుణ సంస్థలకు వసూళ్ల సగటు 30-35 శాతంగానే కొనసాగొచ్చని అభిప్రాయపడింది. 2023-24లో మొత్తంగా ఎన్‌సీఎల్‌టీ 446 కేసుల్లో లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయానికి) ఆదేశాలు జారీచేసింది. 2022-23లో ఈ సంఖ్య 400గా ఉంది. దివాలా స్మృతి అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 5,467 దివాలా పరిష్కార ప్రక్రియలు పూర్తి కాగా.. ఇందులో 45% శాతం కేసులు లిక్విడేషన్‌కు దారి తీశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని