India- China: చైనాతో వాణిజ్య యుద్ధం.. మనకే నష్టం: పనగరియా
భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంపై వాణిజ్య ఆంక్షల్ని విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, అది మనకే నష్టమని పనగరియా హెచ్చరించారు.
దిల్లీ: సరిహద్దుల్లో చైనా (China) చొరబాట్ల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలన్న వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే, దీని వల్ల మనకే నష్టమని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా తెలిపారు. ఈ తరుణంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే భారత ఆర్థిక వృద్ధి (economic growth)ని పణంగా పెట్టినట్లే అవుతుందని హెచ్చరించారు. దానికి బదులుగా భారత్ ఐరోపా సమాఖ్య, యూకేతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు (FTA) కుదుర్చోవాలని సూచించారు.
‘‘ఈ తరుణంలో చైనాతో వాణిజ్య యుద్ధం అంటే మనం మన ఆర్థిక వృద్ధిని త్యాగం చేసినట్లే. ఆర్థికపరంగా చూస్తే అలాంటి నిర్ణయం పూర్తిగా అవివేకమైన చర్య. సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రతీకారంగా చైనాను వాణిజ్యపరమైన ఆంక్షలతో శిక్షించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఆ దేశం ఊరికే కూర్చోదు. అమెరికా వంటి అగ్రదేశాలు ఆంక్షలు విధించినప్పుడు దాని స్పందన ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటిచెప్పింది. రష్యాపై ఆంక్షలు విధించినందుకు ఐరోపా సమాఖ్య భారీ మూల్యమే చెల్లించుకుంటోంది’’ అని పనగరియా అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట డిసెంబరు 9న భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. గతంలో గల్వాన్ లోయలోనూ ఈ తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో వాణిజ్య సంబంధాల్ని వదులుకోవాలని.. ఆ దేశ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో పనగరియా వివరించారు.
ఇరు దేశాలు వాణిజ్య యుద్ధానికి దిగితే నష్టం భారత్‌కే అధికంగా ఉంటుందని పనగరియా అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 17 ట్రిలియన్ డాలర్లనీ.. అదే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ విధించే ఆంక్షల కంటే.. భారత్‌పై చైనా విధించే ఆంక్షల ప్రభావమే తీవ్రంగా ఉంటుందని తెలిపారు. పైగా అమెరికా వంటి పెద్ద దేశమే.. చైనా, రష్యాపై విధించిన ఆంక్షల నుంచి పెద్దగా ఫలితం పొందలేదని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ మధ్య చైనాతో భారత వాణిజ్య లోటు 51.5 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. దీనిపై వివరణ ఇస్తూ.. భారత్ దిగుమతి చేసుకునే చాలా వస్తువుల్ని చైనాయే అత్యంత తక్కువ ధరకు ఇస్తోందని పనగరియా తెలిపారు. అదే భారత్ ఎగుమతులకు మాత్రం చైనా సరైన ధరను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఆయా వస్తువులను అమెరికా వంటి ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే, చైనాతో వాణిజ్య లోటు, అమెరికాతో మిగులు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.
చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే.. ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలతో వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలని పనగరియా సూచించారు. చైనాపై ఆంక్షల కంటే అది మెరుగైన ఫలితాలిస్తుందన్నారు. ప్రస్తుతం గణనీయ వృద్ధిని సాధించేందుకు భారత్‌కు అపార అవకాశాలున్నాయని తెలిపారు. ఆ ఫలితాల్ని తర్వాత దశకానికి కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వేగంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించాలన్నారు. ఒకసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే.. అప్పుడు భారత్ విధించే ఆంక్షల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం