IDBI Bank privatisation: ఐడీబీఐ బిడ్లకు గడువు పొడిగించే అవకాశం!

IDBI Bank privatisation: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రాథమిక బిడ్ల ఆహ్వానానికి గడువును కేంద్రం పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

Updated : 09 Dec 2022 13:18 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు (IDBI Bank privatisation) సంబంధించి ప్రాథమిక బిడ్ల ఆహ్వానానికి గడువును కేంద్రం పొడిగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన గడువు త్వరలో ముగియనుండగా.. దాదాపు నెల రోజులు వరకు పాటు అంటే జనవరి తొలి అర్ధభాగం వరకు పొడిగించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఐడీబీలో ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి కలిపి 94.71 శాతం వాటా ఉంది. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయించేందుకు గానూ అక్టోబర్‌ 7న ఆసక్తి వ్యక్తీకరణ కలిగిన సంస్థలు బిడ్‌లు ఆహ్వానించారు. దీని గడువు డిసెంబర్‌ 16తో ముగియనుంది. అయితే, గడువును పొడిగించాలని లావాదేవీ సలహాదారులకు విన్నపాలు వచ్చాయి. ఏడాది చివర్లో సెలవుల కారణంగా విదేశీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు  పనిచేయవు. అందుకే గడువు పొడిగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మరవైపు ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి మించి (మెజార్టీ) వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడుల సంస్థల బృందానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. కొత్త ప్రైవేట్‌ బ్యాంకులో విదేశీ సంస్థలకు మెజార్టీ వాటా ఉండకూడదు. అయితే ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ షరతు దీనికి వర్తించదని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) ఇటీవల స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని