Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్ల ఆస్తులు రూ.58.91 లక్షల కోట్లు

ఎన్నికల హడావుడి ఉన్నా, దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి మదుపర్ల పెట్టుబడులు భారీగానే కొనసాగాయి. ముఖ్యంగా ఫలితాలపై అనిశ్చితి ఉన్నందున, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించినా, దేశీయ మదుపర్లు మాత్రం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయంగా పెట్టుబడులను మే నెలలోనూ కొనసాగించారు.

Updated : 11 Jun 2024 02:01 IST

ఈక్విటీ ఫండ్లలోకి మేలో రూ.34,697 కోట్లు
కొంగొత్త గరిష్ఠానికి సిప్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల హడావుడి ఉన్నా, దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి మదుపర్ల పెట్టుబడులు భారీగానే కొనసాగాయి. ముఖ్యంగా ఫలితాలపై అనిశ్చితి ఉన్నందున, విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించినా, దేశీయ మదుపర్లు మాత్రం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయంగా పెట్టుబడులను మే నెలలోనూ కొనసాగించారు. మే నెలలో మొత్తం మ్యూచువల్‌ ఫండ్లలోకి నికరంగా రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌ ఆఖరుకు ఈ మొత్తం రూ.2.4 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) సోమవారం వెల్లడించింది. మే చివరి నాటికి మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని  ఆస్తులు (ఏయూఎం) రూ.58,91,160.48 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌ ఆఖరుకు ఈ మొత్తం రూ.57,25,897.98 కోట్లుగా ఉంది. గత నెలలో కొత్తగా 49,74,400 సిప్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొత్తం సిప్‌ ఏయూఎం మేలో రూ.11,52,801 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌లో ఈ మొత్తం రూ11,26,129 కోట్లు. మొత్తం మ్యూచువల్‌ ఫండ్ల పోర్ట్‌ఫోలియోల సంఖ్య 18,59,68,222గా ఉంది. 39 నెలలుగా మ్యూచువల్‌ ఫండ్లలోకి నికర పెట్టుబడులు పెరిగాయని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చలసాని వెంకట్‌ తెలిపారు. సిప్‌ల ద్వారా మే నెలలో రూ.20,904 కోట్లు వచ్చాయని వెల్లడించారు. మొత్తం సిప్‌ ఖాతాల సంఖ్య గరిష్ఠ స్థాయిలో 8,75,89,485 కు చేరినట్లు తెలిపారు. గత నెలలో ఈక్విటీ ఫండ్లలోకి రూ.34,697 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, రాజకీయంగా మార్పులు లేకపోవడంతో దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా చూసినా భారతీయ స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి ఇతర దేశాలతో పోలిస్తే సానుకూలంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈక్విటీలతో పాటు డెట్‌ ఫండ్లలోకి వస్తున్న పెట్టుబడులూ పెరిగాయి. ఇందులోకి మే నెలలో నికరంగా రూ.42,495 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్‌ ఫండ్లు రూ.17,991 కోట్లు, ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)లు రూ.15,180 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని