Smartphone: యాప్‌లు అవసరం లేని స్మార్ట్‌ఫోన్‌.. పరిచయం చేసిన డాయిషే టెలికాం

App Less Smartphone: మరికొన్నేళ్లలో ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఏఐ అంతర్భాగమై పోతుందని డాయిషే టెలికాం తెలిపింది. ఈనేపథ్యంలో యాప్‌లు అవసరం లేకుండానే పనిచేసే ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Published : 28 Feb 2024 15:26 IST

App Less Smartphone | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ ఫోన్లన్నీ పూర్తిగా యాప్‌ల ఆధారంగా పనిచేస్తున్నాయి. మెసేజింగ్‌, సోషల్‌ మీడియా, గేమింగ్‌, బ్యాంకింగ్‌ ఇలా ఏ అవసరానికైనా యాప్‌లనే వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్‌నైనా ఉపయోగించాలి. కానీ, దీనికి భిన్నంగా తాజాగా డాయిషే టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) ఆధారంగా పనిచేసే దీన్ని ఎలాంటి యాప్‌లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC)లో తమ టీ-ఫోన్‌ డివైజ్‌లోని ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ వివరించింది.

యూజర్లు నోటితో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్‌ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను రూపొందించారు. నావిగేషన్‌, క్యాబ్‌, హోటల్‌ బుకింగ్‌.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్‌లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్‌ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుంది. మరోవైపు క్వాల్‌కామ్‌తో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్‌లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్‌లైన్‌ ఫంక్షనాలిటీని జత చేయనుంది.

వచ్చే ఐదు నుంచి పదేళ్లలో ఎవరూ ఫోన్లలో యాప్‌లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డాయిషే టెలికాం సీఈఓ టిమ్‌ హోఎట్జెస్‌ అన్నారు. టెక్ట్స్‌, వాయిస్‌ కమాండ్‌లకు స్పందించడం, గమ్యస్థానాల మార్గాన్ని సూచించడం, ఒక వస్తువును కొనుగోలు చేయడం, ఫొటోలు, వీడియోలు పంపడం వంటి పనులన్నీ తమ కొత్త కాన్సెప్ట్‌ ఫోన్‌ చేస్తుందని తెలిపారు. ‘లార్జ్ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (LLM)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో భాగమైపోతాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని