Disney-Tata Play Deal: ‘టాటా ప్లే’ ఇక పూర్తిగా టాటాలదే.. డిస్నీతో డీల్‌!

Disney-Tata Play Deal: టాటా ప్లేలోని తమ పూర్తి వాటాలను వదులుకునేందుకు వాల్ట్‌ డిస్నీ సిద్ధమైంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

Published : 23 May 2024 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా ప్లేలో తమ పూర్తి వాటాలను విక్రయించేందుకు వాల్ట్‌ డిస్నీ సిద్ధమైంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. అమెరికా మీడియా కంపెనీ వాల్ట్‌ డిస్నీ (Walt Disney) తమ భారత కార్యకలాపాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మీడియా వ్యాపారాల్లో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. వాటిపై దృష్టి సారించటం కోసమే డిస్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత నెల టాటా ప్లే (Tata Play)లో టాటా సన్స్‌ తమ వాటాను 70 శాతానికి పెంచుకుంది. సింగపూర్‌ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ టెమాసెక్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్లకు 10 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈ పరిణామం తర్వాత టాటా ప్లే.. టాటా గ్రూప్‌, డిస్నీ మధ్య 70:30 జాయింట్‌ వెంచర్‌గా మారింది. తాజా ఒప్పందంలో భాగంగా డిస్నీ తమ ఆధీనంలోని 30 శాతం వాటాను టాటా గ్రూప్‌నకు విక్రయించినట్లు సమాచారం. దీంతో ‘టాటా ప్లే’ పూర్తి స్థాయి టాటా కంపెనీగా మారనుంది.

టాటా ప్లేను (Tata Play) 2001లో టీఎఫ్‌సీఎఫ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. సెటాప్‌ బాక్స్ ద్వారా టీవీ ప్రసారాలు, యాప్‌ ద్వారా ఓటీటీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 2.3 కోట్ల కనెక్షన్లు ఉన్నట్లు టాటా సన్స్‌ వెల్లడించింది. కరోనా మునుపటితో పోలిస్తే టాటా ప్లే విలువ 3 బిలియన్‌ డాలర్ల నుంచి బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ.. ఆ గ్రూప్‌ కంపెనీల్లో కీలక వ్యాపారంగా కొనసాగుతోంది. 2022లో ఇది ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, అది మొదలు కాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని