Divgi TorqTransfer IPO: దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ ఐపీఓ ధరల శ్రేణి ₹560-590

Divgi TorqTransfer IPO: టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, టయోటా కిర్లోస్కర్‌ వంటి ప్రముఖ కంపెనీలు కస్టమర్లుగా ఉన్న దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ ఐపీఓ మార్చి 1న ప్రారంభమై 3న ముగియనుంది.

Published : 27 Feb 2023 17:26 IST

దిల్లీ: వాహన పరికరాల తయారీ సంస్థ దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌.. ఐపీఓ (Divgi TorqTransfer IPO) ధరల శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.560- 590గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.412 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ (Divgi TorqTransfer IPO) మార్చి 1న ప్రారంభమై 3వ తేదీన ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 28న బిడ్డింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ ఐపీఓ (Divgi TorqTransfer IPO)లో రూ.180 కోట్లు విలువ చేసే తాజా షేర్లను జారీ చేయనున్నారు. మరో 39.34 లక్షల ఈక్విటీ షేర్లను కొంత మంది ఇన్వెస్టర్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)’ కింద విక్రయించనున్నారు. తయారీ కేంద్రాల్లోకి అవసరమయ్యే యంత్రాల కొనుగోలుతో పాటు ఇతర కార్పొరేట్‌ అవసరాలకు ఐపీఓ నిధులను వెచ్చించనున్నారు. ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో 75 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లు, 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. కనీసం 25 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

సిస్టమ్‌ లెవెల్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్‌, టార్క్‌ కప్లర్‌, డ్యుయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసి వాహన తయారీ సంస్థలకు దివ్‌గీ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి మూడు తయారీ, అసెంబ్లింగ్‌ కేంద్రాలున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ ఈ కంపెనీకి కస్టమర్లుగా ఉన్నాయి. ఇన్‌గా వెంచర్స్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని