Ghost Jobs: ఏమిటీ ఘోస్ట్‌ జాబ్స్‌.. ఉద్యోగ నియామకాల్లో ఎందుకీ ధోరణి..?

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ‘‘ఘోస్ట్ జాబ్స్’’ ట్రెండ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులు దీని గురించి తెలుసుకోవడంతోపాటు వీటిని ఎలా గుర్తించాలనే విషయంపై సూచనలు ఇస్తున్నారు నిపుణులు.

Published : 25 Mar 2024 00:11 IST

Ghost Jobs | ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా సంస్థలు తమ కంపెనీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తాయి. ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతారు. అయితే.. కొన్ని కంపెనీల విషయంలో నెలల పాటు ఎదురుచూసినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. ఆరా తీస్తే చివరకు ఆ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలే లేవనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ఈ తరహా ట్రెండ్‌ ఆందోళన కలిగిస్తోంది.

ఏమిటీ ధోరణి..?

ఉద్యోగ ఖాళీలు లేకున్నా కొన్ని కంపెనీలు కావాలనే నియామక ప్రకటనలు ఇస్తాయి. అంతేకాకుండా నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తాయి. చివరకు అభ్యర్థిని మాత్రం నియమించుకునేందుకు సిద్ధంగా ఉండవు. ఈ తరహా ధోరణినే ‘‘ఘోస్ట్ జాబ్స్ (Ghost Jobs)’’గా పరిగణిస్తారని నివేదికలు చెబుతున్నాయి.

మౌరీన్ క్లాఫ్ అనే ఓ మహిళ సోషల్‌మీడియా యాప్‌ ‘థ్రెడ్‌’ (Thread) లో ‘‘ఘోస్ట్ జాబ్స్’’ గురించి ఆశ్చర్యపరిచే సంఘటనను పంచుకున్నారు. తాను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్‌ఆర్‌ సిబ్బంది ఇలాంటి జాబ్‌ల కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని కోరినట్లు తెలిపారు. ‘‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ కంపెనీ వెబ్‌సైట్లో కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ ఎలాంటి ఖాళీలు ఉండవు. ఇలాంటి ఓపెనింగ్స్‌ పెట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించమన్నారు. నేను దానికి అంగీకరించలేదు’’ అంటూ ఆమె తన ఖాతాలో రాసుకొచ్చారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జొమాటో ఆ నిర్ణయం వెనుక 20 గంటల జూమ్‌ కాల్‌!

ఎందుకిలా చేస్తారు..?

ఉనికిలో లేని ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చే కంపెనీలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి అవసరం లేకున్నా ఇలా జాబ్‌ ఓపెనింగ్స్‌ పెట్టడానికి భిన్న కారణాలు ఉంటాయని పలు నివేదికలతోపాటు మార్కెట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతిభ ఉన్న అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కొన్ని కంపెనీలు ఇలా చేస్తాయట. భవిష్యత్తులో అవసరమయ్యే పొజిషన్ భర్తీ కోసం కూడా ఒక్కోసారి కంపెనీలు ఇలా చేస్తుంటాయని తెలుస్తోంది.

సాధారణంగా ఇచ్చే ఉద్యోగ ప్రకటనల్లో విధులు, అర్హత, బాధ్యతల గురించి నిర్దిష్ట వివరాలు పేర్కొంటారు. ఘోస్ట్‌ జాబ్స్‌లో మాత్రం వాటి గురించి పెద్దగా సమాచారం ఉండదు. నెలలు గడిచినా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే వాటిని ఘోస్ట్‌ జాబ్స్‌ అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదా ఏదైనా సంస్థ ఒకే జాబ్‌ రోల్‌ని (రిక్రూట్‌ పోర్టల్‌లో) భర్తీ చేయకుండా ఎక్కువ కాలం ఉంచినా అనుమానించాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని