Zomato: జొమాటో ఆ నిర్ణయం వెనుక 20 గంటల జూమ్‌ కాల్‌!

Zomato: ఇటీవల జొమాటో ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ప్రత్యేక సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది వివాదం కావటంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. తాజాగా దీని వెనుక జరిగిన చర్చలను సీఈఓ దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు.

Updated : 24 Mar 2024 13:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం శాకాహారుల కోసం మాత్రమే జొమాటో (Zomato) ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డెలివరీ బాయ్స్‌ కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ యూనిఫాం కాకుండా అందరికీ ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను తాజాగా కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) ఓ ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థతో పంచుకున్నారు.

ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ప్రారంభించడానికి ముందు ఓ సర్వే నిర్వహించినట్లు గోయల్‌ తెలిపారు. ‘‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో (Zomato) నుంచి ఏం ఆశిస్తున్నారు?’’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసమేమైనా ఆలోచించమన్న సూచనలు వచ్చాయన్నారు. దీనిపై సుదీర్ఘ చర్చల అనంతరం ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ సేవలను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. తమ బృందంలో ఉన్న సభ్యులెవరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని.. బహుశా అందుకే ఆలోచన రాలేదన్నారు. సోషల్‌ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అవగతమైందని వివరించారు.

ఆ వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని (Zomato) ఉన్నతోద్యోగులందరూ జూమ్‌ కాల్‌లో చర్చించామని వెల్లడించారు. దీన్ని ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్‌ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. కేవలం శాకాహారుల పరిమితులను దృష్టిలో ఉంచుకునే తీసుకొచ్చామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని