Stock Market Today: ఫెడ్‌ రేట్ల కోతపై ఆశతో..

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఎఫ్‌ఐఐ విక్రయాలు: రూ.2,540.16 కోట్లు
డీఐఐ కొనుగోళ్లు: రూ.5,692.81 కోట్లు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) వడ్డీ రేట్ల కోతకు దిగొచ్చనే అంచనాతో దేశీయ సూచీలు బుధవారం రాణించాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు పెరిగి 88.22 వద్ద ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 0.23% పెరిగి 64.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై సూచీలు రాణించాయి. ఐరోపా సూచీలూ ఇదే ధోరణిలో కదలాడాయి.

  • బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3.16 లక్షల కోట్లు పెరిగి, రూ.474.27 లక్షల కోట్ల (5.37 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 
  • సెన్సెక్స్‌ ఉదయం 84,663.68 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,628.16) సానుకూలంగా ప్రారంభమైంది. 84,638.68 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, ఒక దశలో 85,105.83 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 368.97 పాయింట్ల లాభంతో 84,997.13 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 117.70 పాయింట్లు పెరిగి 26,053.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 26,097.85-25,960.30 పాయింట్ల వద్ద కదలాడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌ 2.68%, ఎన్‌టీపీసీ 2.61%, పవర్‌గ్రిడ్‌ 2.58%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.35%, టాటా స్టీల్‌ 1.81%, సన్‌ ఫార్మా 1.73%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.22%, ట్రెంట్‌ 1.16%, రిలయన్స్‌ 1.14%, ఎస్‌బీఐ 1.03% చొప్పున పెరిగాయి. బీఈఎల్‌ 1.54%, ఎటర్నల్‌ 1.24%, ఎం అండ్‌ ఎం 1.15%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.10%, మారుతీ సుజుకీ 1.04% మేర పడ్డాయి.
  • రంగాల వారీ సూచీలకొస్తే విద్యుత్, యుటిలిటీస్, చమురు-గ్యాస్, లోహ, ఇంధన, సేవలు, కమొడిటీస్, భారీ యంత్ర పరికరాలు రాణించాయి. వాహన రంగం ఒక్కటే డీలా పడింది. బీఎస్‌ఈలో 2,446 షేర్లు సానుకూలంగా, 1,727 షేర్లు ప్రతికూలంగా కదలాడాయి. 152 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఫలితాల నేపథ్యంలో..

  • సెప్టెంబరు త్రైమాసిక లాభం 18.5% పెరగడంతో, వరుణ్‌ బెవరేజెస్‌ షేరు బుధవారం బీఎస్‌ఈలో 9.17% పెరిగి రూ.495.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.14,070.32 కోట్లు పెరిగి రూ.1,67,560.63 కోట్లకు చేరింది.
  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) త్రైమాసిక లాభం 28% పెరగడంతో, బీఎస్‌ఈలో షేరు 10.80% లాభంతో రూ.1,113.05 వద్ద స్థిరపడింది.  

ఫ్రాన్స్‌లో హీరో వాహనాలు

ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, ఫ్రాన్స్‌కు చెందిన జీడీ ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ యూరో 5+ శ్రేణి హంక్‌ 440 మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది కంపెనీకి 52వ అంతర్జాతీయ విపణి కావడం గమనార్హం. ఇటీవలే ఇటలీ, స్పెయిన్, యూకే మార్కెట్లలోనూ హీరో మోటోకార్ప్‌ అడుగుపెట్టింది.

దేశంలో ఆమ్‌వే విక్రయశాలలు

అమెరికాకు చెందిన డైరెక్ట్‌ సెల్లింగ్‌ సంస్థ ఆమ్‌వే వచ్చే 3-5 ఏళ్లలో మన దేశంలో విక్రయశాలలు ప్రారంభించనుంది. స్టోర్ల ఏర్పాటు, పంపిణీదార్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 12 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, గ్లోబల్‌ సీఈఓ మైఖేల్‌ నెల్సన్‌ వెల్లడించారు. తమ అంతర్జాతీయ విపణుల్లో టాప్‌-3లో భారత్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్‌వీడియా మార్కెట్‌ విలువ 5 లక్షల కోట్ల డాలర్లు

చిప్‌మేకర్‌ ఎన్‌వీడియా తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన సంస్థగా అవతరించింది. 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన 3 నెలల్లోనే మరో లక్ష కోట్ల డాలర్ల మేర విలువను పెంచుకోవడం విశేషం. బుధవారం ప్రీ-మార్కెట్‌ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 207.80 డాలర్లను తాకడం ఇందుకు నేపథ్యం. 24,300 కోట్ల షేర్లను కలిగి ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువ 5.05 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

ఐపీఓ సమాచారం

  • వేరబుల్స్‌ బ్రాండ్‌ బోట్‌ మాతృ సంస్థ ఇమాజిన్‌ మార్కెటింగ్, ఐపీఓ ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించేందుకు నవీకరించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద దాఖలు చేసింది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో రూ.1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు.
  • లెన్స్‌కార్ట్‌ ప్రీ-ఐపీఓ విడతలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఈ లావాదేవీలో భాగంగా ప్రమోటర్లలో ఒకరైన నేహా బన్సల్‌ ఒక్కో ఈక్విటీ షేరును రూ.402 ధరతో మొత్తం 24.87 లక్షల ఈక్విటీ షేర్లను ఎస్‌బీఐ ఆప్టిమల్‌ ఈక్విటీ ఫండ్‌ (ఏఐఎఫ్‌), ఎస్‌బీఐ ఎమర్జెంట్‌ ఫండ్‌ ఏఐఎఫ్‌లకు బదిలీ చేశారు. ఈ లావాదేవీ తర్వాత లెన్స్‌కార్ట్‌లో బన్సల్‌ వాటా 7.61% నుంచి 7.46 శాతానికి తగ్గింది. ఈ నెల 31 నుంచి నవంబరు 4 వరకు ఐపీఓ ఉండనుంది. రూ.7,278 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.382-402.
  • రూ.1,667 కోట్ల ఓర్ల్కా ఇండియా ఐపీఓకు తొలిరోజున 78% స్పందన లభించింది. కంపెనీ 1,59,99,104 షేర్లను ఆఫర్‌ చేయగా, 1,25,56,940 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల నుంచి 1.53 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 90%, అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగం నుంచి 2 రెట్ల స్పందన లభించింది.
  • గోల్డీ సోలార్‌ రూ.1,400 కోట్లకు పైగా నిధులను హావెల్స్‌ ఇండియా, జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్‌ కామత్‌ తదితర పెట్టుబడిదార్ల నుంచి సమీకరించింది. దేశీయంగా సోలార్‌ మాడ్యూళ్ల సామర్థ్య విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు