5G connectivity: 5జీ కనెక్టవిటీకి డ్రోన్లు, బెలూన్లు.. డాట్‌ ‘ఎమర్జెన్సీ’ సన్నద్ధత

5G connectivity: అత్యవసర సమయాల్లో మొబైల్‌ కనెక్టివిటీ కోసం డ్రోన్లు, బెలూన్లు వినియోగించాలని డాట్‌ భావిస్తోంది.

Published : 01 Jun 2024 17:44 IST

5G connectivity | ఇంటర్నెట్‌ డెస్క్‌: భూకంపాలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రధానంగా ప్రభావితమయ్యేవి విద్యుత్‌, టెలికాం సర్వీసులే. మారుమూల ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా కమ్యూనికేషన్‌ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తాత్కాలికంగా టెలికాం సర్వీసులను అందించడంపై టెలికాం విభాగం దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో 5జీ కనెక్టివిటీని అందించేందుకు డ్రోన్లు, బెలూన్లు వినియోగించాలని చూస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అత్యవసర సమయాల్లో డ్రోన్లు, బెలూన్ల సాయంతో టెలికాం సర్వీసులను అందించడంలో సాధ్యాసాధ్యాలపై రాబోయే కొన్ని నెలల్లో డాట్ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. ప్రకృతి విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడినప్పుడు తాత్కాలికంగా మొబైల్‌ కవరేజీని అందించడం వీటిద్వారా వీలు పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం కంటే ఇది సులువైన పద్ధతి అని ప్రభుత్వం కూడా భావిస్తోంది.

అత్యవసర సమయల్లో టెలికాం కంపెనీలు తమకు కేటాయించిన స్పెక్ట్రమ్‌నే వాడుకోవచ్చు. బ్యాకప్‌ లేదా సోలార్‌ టెక్నాలజీ సాయంతో పవర్‌ సప్లయ్‌ అవసరాలను తీర్చుకోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి అత్యవసర సమయాల్లో కనీస సంఖ్యలో పోర్టబుల్‌ బేస్‌ స్టేషన్లు, శాటిలైట్‌ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. వీటికి అదనంగా డ్రోన్లు, బెలూన్లు కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని