Cushman and Wakefield India: ఇళ్ల ధరలు పెద్దగా పెరగవ్‌!

కొవిడ్‌ పరిణామాల అనంతరం ఇళ్లకు గిరాకీ అధికమవ్వడంతో, గత రెండేళ్లలో సరఫరా భారీగా పెరిగింది. దీంతోపాటు ధరలూ అధికమయ్యాయి. అందువల్ల స్వల్ప, మధ్యకాలానికి ఇళ్ల ధరలు నామమాత్రంగానే పెరగొచ్చని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా అధిపతి అన్షుల్‌ జైన్‌ అంటున్నారు.

Published : 23 May 2024 02:08 IST

ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరువలో
కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా అధిపతి అన్షుల్‌ జైన్‌ 

దిల్లీ: కొవిడ్‌ పరిణామాల అనంతరం ఇళ్లకు గిరాకీ అధికమవ్వడంతో, గత రెండేళ్లలో సరఫరా భారీగా పెరిగింది. దీంతోపాటు ధరలూ అధికమయ్యాయి. అందువల్ల స్వల్ప, మధ్యకాలానికి ఇళ్ల ధరలు నామమాత్రంగానే పెరగొచ్చని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా అధిపతి అన్షుల్‌ జైన్‌ అంటున్నారు. దేశ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుండడంతో పాటు, సొంత ఇల్లు సమకూర్చుకునేందుకు యువ జనాభా మక్కువ చూపుతున్నందున, ఇళ్లకు గిరాకీ మాత్రం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ‘2013-14 నుంచి 2019 వరకు భారత్‌లో ఇళ్లకు గిరాకీ స్తబ్దుగానే కొనసాగింది. ధరలూ పెద్దగా పెరగలేదు. ‘అద్దెకు ఉన్నా సరిపోతుంది, తప్పనిసరిగా సొంత ఇల్లు ఎందుకు’ అనే భావన అప్పట్లో ఉంది. అయితే కరోనా ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చింది. అద్దె ఇళ్లలో ఉన్నవారు ఆ సమయంలో చాలా బాధలు పడ్డారు. అపుడే సొంత ఇంటిలో ఉండే స్థిరత్వాన్ని అర్థం చేసుకోగలిగారు. అంతే కాదు పెద్ద ఇళ్ల వైపూ దృష్టి పెట్టారు. ఇందుకు తక్కువ వడ్డీ రేట్లూ కలిసివచ్చాయ’ని ఆయన వివరించారు. 

2013-14 నుంచి ఇప్పటిదాకా..: ‘కరోనా అనంతరం అధిక గిరాకీ కారణంగా ఇళ్ల విక్రయాలు, ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతుండడంతో మార్కెట్లోకి పెట్టుబడిదార్లు తరలివచ్చార’ని తెలిపారు. ‘గత రెండేళ్లలో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే గరిష్ఠస్థాయులకు చేరాయి. నిర్మాణ వ్యయాల వల్ల భవిష్యత్తులోనూ ధరల్లో వృద్ధి ఉంటుంది.. కానీ అది అసాధారణంగా ఉండద’ని జైన్‌ అంచనా వేశారు. 

మారుతున్న ధోరణి: గత ఏడాది (2023 క్యాలెండర్‌)లో 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జీవనకాల గరిష్ఠానికి చేరగా.. ధరలు మాత్రం సగటున వార్షిక పద్ధతిలో 10% పెరిగాయి. చిన్న నగరాలు/పట్టణాల్లో మాత్రం 40-70%వరకు ధరలు పెరిగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని