Paytm: పేటీఎం ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించిన ఈడీ!

Paytm: ఆర్‌బీఐ లేవనెత్తిన అంశాలపై విచారణ ప్రారంభించాలా.. వద్దా.. అనే అంశాన్ని పత్రాలను పరిశీలించి ఈడీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Updated : 15 Feb 2024 12:50 IST

Paytm | దిల్లీ: పేటీఎంకు (Paytm) చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) గురువారం విచారించినట్లు సమాచారం. ఆర్‌బీఐ (RBI) ఆంక్షల నేపథ్యంలో వారి నుంచి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవలి ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీపై విచారణ ప్రారంభించాలా.. వద్దా.. అనే అంశాన్ని ఈ పత్రాలను పరిశీలించి ఈడీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఫెమా చట్టంలోని నిబంధనలను ఏమైనా ఉల్లంఘించారేమో అని ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

ప్రశ్నిస్తున్న సమయంలోనే పేటీఎం (Paytm) అధికారుల నుంచి కొన్ని పత్రాలను తీసుకున్న ఈడీ.. మరికొంత సమాచారాన్ని అడిగినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకైతే ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఏమైనా కనుగొంటే మాత్రం వెంటనే కేసు నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) గతవారం కోరిన విషయం తెలిసిందే.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయొద్దని తెలిపింది. సమగ్ర పరిశీలన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వీటిని సడలించడంపై ఎలాంటి సమీక్ష జరపడం లేదని సోమవారం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని