Investing for a child: పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్‌వీస్‌ సీఈఓ టిప్స్‌

Tips on investing for a child: పిల్లల మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఆమె మాటల్లోనే..!

Published : 01 Apr 2024 00:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా (Radhika Gupta) కొన్ని విలువైన సూచనలు చేశారు. చిన్న వయసులోనే మదుపు ప్రారంభించాలని ప్రోత్సహించే ఆమె.. పిల్లల కోసం కూడా వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. కీలక పత్రాలను చేయించడంతో మొదలుపెట్టి నెలనెలా సిప్‌ చేయాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకొని.. పరిస్థితులకు అనుగుణంగా వాటిని సమీక్షించాలని ఎక్స్‌ వేదికగా సూచించారు. ఆ సూచనలేంటో చూద్దాం..

  • జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వంటి డాక్యుమెంట్లను చేయించాలి. మైనర్లు అయినప్పటికీ వీటన్నింటినీ పొందొచ్చు.
  • పిల్లల కోసం మదుపు చేసే ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు వారి ఉన్నత చదువులు. దీన్ని తిరిగి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని.. ఒక్కో ఏడాది ఎంత ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయించుకోవాలి.
  • ప్రతినెలా క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (SIP) మదుపు చేయాలి. కనీసం 2, 3 ఫండ్లలో సిప్‌ చేస్తే మేలు. మార్కెట్‌ ఎక్స్‌పోజర్‌ కోసం లార్జ్‌/మిడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌, రిస్క్‌ కోసం మిడ్‌/స్మాల్‌ ఫండ్‌, విదేశీ విద్య కోసం కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇంటర్నేషనల్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
  • లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటికి చేరువవుతున్న కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. పిల్లలకు అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత వారిని కూడా ఈ ప్రయాణంలో భాగం చేయాలి.
  • ఇది ప్రతిఒక్కరికీ సరిపోయే ప్రణాళిక కాదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి వారు వాళ్ల ప్రణాళికలను రచించుకోవాలి. ‘‘ఆట వస్తువులతో ఇంటిని నింపి స్థలం లేకుండా చేసుకోవడానికి బదులు ఇలాంటి ఆర్థిక బహుమతుల వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. వీటి వల్ల ప్రయోజనమే కాకుండా.. ఇంట్లో స్థలమూ మిగులుతుంది’’ అని గుప్తా సరదాగా వ్యాఖ్యానించారు.

పిల్లలు పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందొచ్చని.. దానితో ఆధార్‌ కార్డు తీసుకోవచ్చని మరో ఎక్స్‌ పోస్ట్‌లో రాధికా గుప్తా తెలిపారు. ఈ రెండూ ఉంటే పాన్‌ లభిస్తుందని చెప్పారు. మైనర్లకూ బ్యాంక్‌ అకౌంట్‌ తీసే సదుపాయం ఉంటుందని వెల్లడించారు. పిల్లల పేరు మీద ప్రత్యేకంగా చిల్డ్రన్ ఫండ్స్‌లోనే కాకుండా రెగ్యులర్‌ వాటిలో కూడా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉంటుందని చెబుతూ.. పిల్లల విషయంలో ఉన్న కొన్ని అపోహలను తొలగించారు.

ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్‌ హెచ్చుతగ్గుల వల్ల నష్టభయం ఉండొచ్చు. ఇందుకు భిన్నంగా నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిప్‌ (SIP) పనిచేస్తుంది. కొంత మొత్తంతో ప్రారంభించి, కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని జమ చేసేందుకు ఈ మార్గం తోడ్పడుతుంది. ఆదాయం, ఆర్థిక లక్ష్యాలను బట్టి, మీరు అనుకున్నంత కాలంపాటు ప్రతి వారం, నెల, త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని