Elections: ఈ-కామర్స్ సైట్లలోనూ ఎన్నికల హడావుడి

Elections: ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన అనేక రకాల వస్తువులు ఈ-కామర్స్‌ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

Updated : 22 Mar 2024 16:05 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల (Lok sabha Elections) సందడి నెలకొంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు సభలు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ హడావుడి ఇప్పుడు ఈ-కామర్స్‌ సైట్లలోనూ కనిపిస్తోంది. భాజపా (BJP) కమలం బ్యాడ్జ్‌లు, ఆప్‌ లోగోతో గడియారాలు, కాంగ్రెస్‌ (Congress) కండువాలు.. ఇలా ఎలెక్షన్‌ థీమ్‌తో వివిధ రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ-కామర్స్‌ సైట్లలోని సెర్చ్‌ బార్‌లో రాజకీయ పార్టీ పేరు ఎంటర్‌ చేస్తే చాలు జెండాలు, లాకెట్లు, పెన్నులు, కండువాలు.. ఇలా రకరకాల వస్తువులు తెరపై దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రారంభమైంది. కానీ, 2020 కరోనా సంక్షోభం కావడంతో ఆదరణ తగ్గింది. కాని ఇప్పుడు ఈ-కామర్స్‌ సైట్లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈసారి తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మాత్రం ఎందుకు విక్రయించొద్దనే ఉద్దేశంతోనే విక్రేతలు ఎలక్షన్‌ ఆధారిత వస్తువులను సైతం తమ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

కొన్ని పార్టీలు సొంతంగా వెబ్‌సైట్లను ప్రారంభించి పలు రకాల వస్తువులను విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవలే నమో మర్చండైజ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. అందులో టీ-షర్టులు, పుస్తకాలు, బ్యాడ్జ్‌లు, రిస్ట్‌బ్యాండ్‌లు, కీచైన్లు, స్టిక్కర్లు, టోపీలు, పెన్నులు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ కా పరివార్‌’, ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’, ‘మోదీ కీ గ్యారంటీ’.. ఇలా వివిధ రకాల నినాదాలతో వాటిని రూపొందించారు.

రాజకీయ పార్టీలకు సంబంధించిన వస్తువులను గత కొంతకాలంగా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఉంచుతున్నామని ఓ విక్రేత తెలిపారు. కానీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటికి ఇప్పుడు డిమాండ్‌ పెరిగిందన్నారు. భాజపా, కాంగ్రెస్‌కు సంబంధించిన వస్తువులకు భారీ గిరాకీ ఉందని వెల్లడించారు. ఈసారి ప్రాంతీయ పార్టీల వస్తువులకు సైతం డిమాండ్‌ పెరిగిందని మరో సెల్లర్‌ తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ లోగోతో కీచైన్‌లు, టీఎంసీ ఏసీ అడాప్టర్‌ నైట్‌ ల్యాంప్‌లు, సీపీఎం బానెట్‌ జెండాలకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.

మరోవైపు ఒకప్పుడు దుకాణాల్లో మాత్రమే ఎలక్షన్లకు సంబంధించిన వస్తువులను విక్రయించిన వ్యాపారులు.. నెమ్మదిగా ఆన్‌లైన్‌ వైపు మళ్లుతున్నారు. గత దశాబ్దకాలంగా పరిస్థితి పూర్తిగా మారిందని.. ఆన్‌లైన్‌ ప్రచారానికి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో వస్తువులనూ ఆ వేదికగా అందుబాటులో ఉంచాల్సివస్తోందని వివరించారు. ఈనేపథ్యంలో ఆయా వస్తువులను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై విక్రయిస్తున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని