TATA Motors: రాబోయే రోజుల్లో ఈవీల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌: టాటా మోటార్స్‌

TATA Motors: ఈవీల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్‌ ఉండడం వల్ల వాటి సామర్థ్యం మరింత పెరుగుతుందని టాటా మోటార్స్‌ తెలిపింది. సంప్రదాయ ఇంజిన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈవీలను నిర్మించడం వల్ల కొన్ని లోపాలు ఉంటాయని పేర్కొంది.

Published : 15 Oct 2023 15:14 IST

TATA Motors | పుణె: సంప్రదాయ ఇంజిన్‌, విద్యుత్‌ ప్రయాణికుల వాహనాల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్లాట్‌పామ్‌లను ఏర్పాటు చేస్తామని టాటా మోటార్స్‌ (TATA Motors) తెలిపింది. తద్వారా భవిష్యత్ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. అలాగే సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌లపై ఈవీ (Electric Vehicles)లను అభివృద్ధి చేయడం వల్ల తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు మార్గం సుగమమవుతుందని డిజైన్‌ విభాగాధిపతి మార్టిన్ ఉహ్లారిక్ తెలిపారు.

విద్యుదీకరణ, కనెక్టివిటీ వేగంగా ఊపందుకుంటున్న నేపథ్యంలో సౌలభ్యాన్ని కోరుకుంటున్నారని మార్టిన్‌ తెలిపారు. భవిష్యత్‌లో కార్ల లోపలి భాగాన్ని ఒక ఇంటి తరహాలో మార్చాల్సి ఉంటుందన్నారు. సంప్రదాయ ప్లాట్‌ఫామ్‌పై ఈవీలను డిజైన్‌ చేయడం వల్ల దూరం, బ్యాటరీ లేఅవుట్‌ విషయంలో వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాట్‌ఫామ్‌లను విభజించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పరిశ్రమలో ప్రారంభమైందన్నారు. టాటా మోటార్స్‌ ఈవీలైన నెక్సాన్‌ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్‌ ఈవీలను సంప్రదాయ ఐసీఈ ప్లాట్‌ఫామ్‌లపైనే రూపొందించారు.

గత సంవత్సరం టాటా మోటార్స్‌ (TATA Motors) సరికొత్త విద్యుత్‌ వాహన ఆర్కిటెక్చర్‌ను ఆవిష్కరించింది. దీని మీదే 2025 నుంచి పలు అధునాతన EVలను డిజైన్‌ చేయాలని యోచిస్తోంది. ‘అవిన్య (AVINYA)’ పేరిట తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్‌పై తయారు చేసిన తొలి మోడల్ 2025లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ ‘కర్వ్‌ (CURVV)’ను సైతం గత ఏడాది పరిచయం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని