Electric vehicles Guidelines: విద్యుత్తు విధాన మార్గదర్శకాలు త్వరలో

మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది.

Updated : 21 May 2024 08:01 IST

పరిశ్రమలను ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు
రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టతకు తయారీ సంస్థలతో మరోసారి సమావేశం

దిల్లీ: మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈవీ నూతన విధాన మార్గదర్శకాలను ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈవీ తయారీ సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాలు, పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లోపే ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. టెస్లా వంటి అంతర్జాతీయ సంస్థలను, దేశీయంగా ఇతర పారిశ్రామిక దిగ్గజ సంస్థలను మన ఈవీ రంగంలోకి ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా, మార్గదర్శకాలను ఆవిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఈవీ విధానం (స్కీమ్‌ టు ప్రమోట్‌ మానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) తీసుకువచ్చింది. ఈ విధానం కింద ప్రభుత్వం నుంచి రాయితీలు పొందాలంటే కొత్తగా మనదేశంలో పెట్టుబడి పెట్టాలి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడికి మాత్రం రాయితీలు రావు. ఏప్రిల్‌లో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది. టెస్లా, మరికొన్ని ఇతర సంస్థల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. మరో దఫా పరిశ్రమ వర్గాలతో సమావేశం నిర్వహించి, ఆ తర్వాత మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఈవీ ప్రాజెక్టుపై 500 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4150 కోట్ల) పెట్టుబడి పెడితే, పన్నుల భారం తగ్గటంతో పాటు, పలు రాయితీలు లభిస్తాయి. ఈ విధానం ప్రకారం రాయితీలు ఆశించే సంస్థలు, ఈ ఏడాది జులై 31 తర్వాత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగు నెలల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆయా సంస్థల అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అటువంటి సంస్థలు మూడేళ్లలో తమ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. అయిదేళ్లలో కనీసం 50 శాతం డీవీఏ (దేశీయంగా విలువ జతచేయాలి) సాధించాలి. అంటే ఆ మేరకు విడిభాగాలను మనదేశంలో ఉత్పత్తి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని