Elon Musk: ఎలాన్‌ మస్క్‌ను చూసి ఏడ్చేసిన తండ్రి.. ఏడేళ్ల తర్వాత ఇరువురి భేటీ

Elon Musk: ఇటీవల స్పేస్‌ఎక్స్‌ మెగా రాకెట్‌ స్టార్‌షిప్‌ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ ఆయన తండ్రి ఎరాల్‌ మస్క్‌ను కలిశారు. దీంతో వారి కుటుంబంలో భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయి.

Updated : 24 Nov 2023 13:33 IST

టెక్సాస్‌: స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కుటుంబంలో ఇటీవల భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన తన తండ్రి ఎరాల్‌ మస్క్‌ను కలవడమే ఇందుకు కారణం. టెక్సాస్‌ తీరం నుంచి గత శనివారం మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అది విఫలమైనప్పటికీ.. మస్క్‌ కుటుంబంలో మాత్రం ఆనందం నెలకొంది.

స్టార్‌షిప్‌ ప్రయోగానికి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన తండ్రి ఎరాల్‌ను కూడా ఆహ్వానించారని ‘ది సన్‌’ అనే పత్రిక పేర్కొంది. ఈ కార్యక్రమానికి ఎరాల్‌ తన మాజీ భార్య హైడ్, మనవరాలు కోరాతో కలిసి హాజరయ్యారు. ఎలాన్‌ను చూసి ఆయన తండ్రి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారని హైడ్‌ తెలిపారు. ఎలాన్‌ మస్క్‌ సైతం తండ్రిని చూసి చాలా సంతోషించారని పేర్కొన్నారు.

ఇరువురూ పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించుకున్నారని ‘ది సన్‌’కు హైడ్‌ తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసి తాను, తన కూతుళ్లు చాలా సంతోషించామని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఇవి చాలా భావోద్వేగపూరితమైన క్షణాలని అన్నారు. వీఐపీ గ్యాలరీలో కూర్చొని మస్క్‌ (Elon Musk) కుటుంబం రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించింది. ఎంఆర్‌ఎన్‌ఏ పరిశోధన, ఆర్థోపెడిక్ సర్జరీ సంబంధిత అంశాలు, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్‌’ అనే ఔషధాల ముప్పు.. వంటి విషయాల గురించి ఇద్దరం చర్చించామని ఎరాల్‌ తనతో చెప్పారని హైడ్ తెలిపారు.

చివరిసారి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆయన తండ్రిని 2016లో కలిశారు. సోదరుడు కింబల్‌ మస్క్‌తో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తండ్రి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత వారు కలవడం ఇదే. ఇరువురి మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉన్నట్లు ఇటీవల విడుదలైన ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్ర పుస్తకంలో రచయిత ఐజాక్సన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ను రూపొందించింది. గత శనివారం జరిగిన రెండో ప్రయోగంలోనూ ఇది విఫలమైంది. నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అది పేలిపోయింది. అయితే, విస్ఫోటానికి ముందు అది విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించగలిగింది. అదొక్కటే ఊరట కలిగించే అంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని