Elon Musk: అవే నా ప్రాణాలను కాపాడాయి: ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ఆధునిక ఔషధాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాన్‌ మస్క్ ట్వీట్‌ చేశారు. అవి ఆయనను ఎలా రక్షించాయో వెల్లడించారు.

Updated : 19 Jun 2023 15:35 IST

వాషింగ్టన్‌: ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం నేటి ప్రపంచం చేసుకున్న గొప్ప అదృష్టమని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) అన్నారు. అవే తనను మలేరియా (Malaria) నుంచి రక్షించాయని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ఆయన తల్లి మే మస్క్ స్పందించారు. ఎలాన్‌ మస్క్‌ ( Elon Musk) మలేరియా బారిన పడిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

‘‘నిజం చెప్పాలంటే.. ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం మన అదృష్టం. క్లోరోక్వైన్‌, డాక్సీసిక్లైన్ (chloroquine & doxycycline) గనక ఇచ్చి ఉండకపోతే నేను మలేరియా (Malaria) వల్ల మరణించి ఉండేవాణ్ని. అయినప్పటికీ.. ఔషధాలను పవిత్రంగా భావించడానికి బదులు వాటిని మనం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. శాస్త్ర విజ్ఞాన పునాదులే ప్రశ్నించడంపై ఉన్నాయి. తద్వారా వాస్తవానికి చేరువయ్యే ప్రయత్నం చేయాలి’’ అని మస్క్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

దీనికి ఆయన తల్లి మే మస్క్‌ స్పందిస్తూ.. ‘‘నీకు (ఎలాన్‌ మస్క్‌) మలేరియా సోకడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లావు. కొన్ని రోజుల పాటు వణికిపోయావు. నీ శరీరంలోకి అనేక ట్యూబులను అమర్చారు. అది చాలా భయంకరమైన కాలం. ఆధునిక ఔషధాలే నిన్ను రక్షించాయి’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని