Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్‌ ఆగ్రహం!

Elon Musk | యూదు వ్యతిరేక పోస్ట్‌నకు మద్దతు తెలిపినందుకు మస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. దీనిపై మస్క్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated : 30 Nov 2023 11:04 IST

న్యూయార్క్‌: తమ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’పై (Social Media X) వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీలపై ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లానుకునేవారు వెళ్లొచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇటీవల ‘ఎక్స్‌’లో ఓ యూదు వ్యతిరేక పోస్టుకు మద్దతునిచ్చినందుకు మస్క్‌ (Elon Musk) తాజాగా క్షమాపణలు చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ డీల్‌బుక్‌ సమ్మిట్‌లో బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు చేసిన మెసేజ్‌లలో ఇదే అత్యంత దారుణమైన పోస్ట్‌ అని తెలిపారు. ‘ఎక్స్‌’ నుంచి వాణిజ్య ప్రకటనలను ఉపసంహరించుకోవాలని చూస్తున్న వారికి ఇది ఆయుధంగా మారిందని పేర్కొన్నారు. అయితే, తాను (Elon Musk) యూదు వ్యతిరేకినని ప్రచారం చేస్తూ బెదిరించాలనుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల సందర్భంలో ఆయన ఓ అభ్యంతరకర పదాన్ని పలుసార్లు ఉపయోగించారు. అలాగే ‘ఎక్స్‌’కు వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీల జాబితాలో ఉన్న వాల్ట్‌ డిస్నీ సీఈఓ బాబ్‌ ఇగర్‌ పేరును నేరుగా ప్రస్తావించారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ‘గ్రేట్‌ రీప్లేస్‌మెంట్’ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ యూదు వ్యతిరేక ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వామపక్షవాదులు, యూదులు కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్వేతజాతి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్నారన్నది ‘గ్రేట్‌ రీప్లేస్‌మెంట్’ సారాంశం. దీన్ని ఆధారం చేసుకొని ఇటీవల ఓ వ్యక్తి ‘ఎక్స్‌’లో యూదు వ్యతిరేక పోస్ట్‌ చేశారు. దీనికి మస్క్ (Elon Musk) మద్దతు తెలిపారు.

నాటి నుంచి మస్క్‌ (Elon Musk)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్‌లో ఆయన పర్యటించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యూదు విద్వేష భావజాలానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. మస్క్‌ చేసిన ఈ పోస్ట్‌ తర్వాతే వాల్ట్‌ డిస్నీ, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, ఎన్‌బీసీయూనివర్సల్‌ వంటి కంపెనీలు ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని