Elon Musk : కుమారుడితో కలిసి స్పేస్‌ ఎక్స్‌ ఆఫీస్‌లోకి మస్క్‌.. ఫొటోలు వైరల్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తన కుమారుడు ఎక్స్‌తో కలిసి సరదాగా గడిపిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Published : 17 Jul 2023 01:43 IST

Image : Maye Musk

వాషింగ్టన్‌ డీసీ : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తన కుమారుడు ఎక్స్‌ను ‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ శుక్రవారం మొత్తం సరదాగా గడిపినట్లు మస్క్‌ తల్లి మే మస్క్‌ ట్విటర్‌ (Twitter)లో వెల్లడించారు. ఎలాన్‌ మస్క్‌, కెనడియన్‌ గాయని గ్రిమ్స్‌ దంపతులకు 2020 మే 4న ఎక్స్‌ జన్మించాడు. ఎలాన్‌ మస్క్‌ తన కుమారుడితో కలిసి గడుపుతున్న ఫొటోలను పోస్ట్‌ చేయగానే వాటికి 31 లక్షల లైకులు వచ్చాయి. రెండు మిలియన్ల రీచ్‌ దక్కింది. 

‘హ్యాట్సాఫ్‌ ఎలాన్‌ మస్క్‌. చాలా మంది బిలియనీర్లు  శుక్రవారం రాత్రి పార్టీలు చేసుకున్నారు. ఎంజాయ్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ మాత్రం తన ప్రియమైన కుమారుడితో కలిసి కంపెనీలను తనిఖీ సందర్శిస్తున్నాడని’ ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘పదాల కంటే ఫొటోలు ఇంకా బిగ్గరగా మాట్లాడతాయి. అవి మన జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉంటాయి. ఎలాన్‌ సాధించిన విజయాలు, పిల్లల పట్ల తాను చూపిస్తున్న ప్రేమ అందంగా ఆకట్టుకుంటోందని’ మరో నెటిజన్‌ ప్రశంసించాడు. ‘ఆ పిల్లవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసే అనుభవాలను తెలుసుకుంటున్నాడు’ అని మరొక నెటిజన్‌ కామెంట్ చేశాడు. 

కొద్ది నెలల క్రితం ఎలాన్‌ మస్క్‌ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ఎక్స్‌ అనుకోకుండా ప్రత్యక్షమయ్యాడు. మస్క్‌ ఒడిలో కూర్చుని సందడి చేశాడు. కెమెరా వైపు చూస్తూ పలుమార్లు హాయ్‌ చెప్పాడు. దానికి ముచ్చటపడి మస్క్‌ నవ్వుకున్నాడు. అంతకుముందు కూడా ఎక్స్‌ ట్విటర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు. మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేసిన రోజున కూడా మస్క్‌ కుమారుడితో కలిసి వెళ్లి కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మస్క్‌, గ్రిమ్స్‌  తమ కుమారుడిని బయటి ప్రపంచానికి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంచుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని