Elon Musk: మస్క్‌ కొనుగోలు తర్వాత ‘ఎక్స్‌’ విలువ 71% పతనం!

Elon Musk: ఎక్స్‌లో అనేక మార్పుల కారణంగా దాని విలువ గణనీయంగా పతనమైందని ఫిడెలిటీ నివేదిక వెల్లడించింది.

Updated : 04 Jan 2024 11:55 IST

Elon Musk | వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’ (Social Media X) విలువ గణనీయంగా పడిపోయినట్లు ప్రముఖ పెట్టుబడుల సంస్థ నివేదిక వెల్లడించింది. యూజర్ల సంఖ్య తగ్గడం, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో కుంగుబాటు, కంటెంట్‌పై ఆందోళనలు వంటివి దీనికి కారణమని పేర్కొంది. 

‘ఎక్స్‌’ను బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) 2022 అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మొత్తంతో పోలిస్తే కంపెనీ విలువ 2023 డిసెంబర్‌ 30 నాటికి 12.5 బిలియన్‌ డాలర్లకు పతనమైనట్లు ఫిడెలిటీ వెల్లడించింది. అంటే 71.5 శాతం కంపెనీ విలువ ఆవిరైంది. మస్క్‌ దాన్ని సొంతం చేసుకున్న కొన్ని నెలల్లోనే యూజర్ల సంఖ్య 15 శాతం తగ్గినట్లు తెలిపింది.

ట్విటర్‌ పేరును ‘ఎక్స్‌’గా (Social Media X) మార్చడం సహా మస్క్‌ హయాంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్‌ నియంత్రణ విషయంలో ఉదార విధానాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ‘ఎక్స్‌’లో ఎక్కువవుతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇతర దిగ్గజ సామాజిక మాధ్యమాలతో పోలిస్తే ‘ఎక్స్‌’లోనే తప్పుడు సమాచారం అధికమని గత సెప్టెంబర్‌లో ఐరోపా సమాఖ్య హెచ్చరించింది.

‘ఎక్స్‌’లో వచ్చిన మార్పులు, సమాచార నియంత్రణా విధానాలను నిరసిస్తూ పలు సంస్థలు వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. యూదు వ్యతిరేక పోస్టులకు మస్క్‌ (Elon Musk) మద్దతు తెలపడాన్ని ఆక్షేపిస్తూ డిస్నీ, యాపిల్‌, కోకా కోలా వంటి సంస్థలు దూరమయ్యాయి.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం 2024 జనవరి 4 నాటికి మస్క్‌ (Elon Musk) 220 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ట్విటర్ కొనుగోలును మానవాళికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా మస్క్‌ గతంలో అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని