Elon Musk: ఎలాన్‌ మస్క్‌ను చంపేస్తారేమో.. తండ్రి ఆందోళన!

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ అమెరికా ప్రభుత్వ నిర్ణయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నారంటూ ‘న్యూ యార్కర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మస్క్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుని చంపేస్తారేమోనని భయమేస్తోందన్నారు.

Updated : 05 Sep 2023 14:36 IST

వాషింగ్టన్‌: టెస్లా, ఎక్స్‌ (ట్విటర్‌) అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ను చంపేస్తారేమోనంటూ స్వయంగా ఆయన తండ్రి ఎరాల్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారంటూ ‘ది న్యూ యార్కర్‌’ ప్రచురించిన ఓ కథనాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ది న్యూ యార్కర్‌ ‘ఎలాన్‌ మస్క్‌ షాడో రూల్‌’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అంతరిక్షం, ఉక్రెయిన్‌, సామాజిక మాధ్యమాలు, విద్యుత్‌ వాహనాల వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మస్క్‌ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో మస్క్‌ స్టార్‌లింక్‌ ఉపగ్రహ సేవలు ఎంత కీలకంగా వ్యవహరించాయో కూడా పత్రిక ఉటంకించింది. మరోవైపు ‘విదేశాలతో మస్క్‌ సంబంధాలను పరిశీలించాల్సి ఉంది’ అంటూ ట్విటర్‌ కొనుగోలు సమయంలో అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలనూ న్యూ యార్కర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

ఈ కథనాన్ని ఉద్దేశిస్తూ.. ఇది ఎలాన్‌ మస్క్‌పై దాడే అని ఎరాల్‌ ‘ది సన్‌’ మీడియాతో మాట్లాడుతూ ఎరాల్‌ అన్నారు. ‘‘షాడో ప్రభుత్వ’’ మద్దతుతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. ‘‘ఈ షాడో ప్రభుత్వమే ఎలాన్‌ మస్క్‌ను అంతం చేస్తుందని మీరు భయపడుతున్నారా?’’ అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘‘అవును’’ అని సమాధానమివ్వడం గమనార్హం. ట్విటర్‌ కొనుగోలు విషయంలో మస్క్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సామాజిక మాధ్యమ వేదికపై విద్వేషపూరిత సందేశాలను అనుమతిస్తున్నారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్‌ సేవలను అందించడంపై రష్యా స్పేస్‌ ఏజెన్సీ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌.. మస్క్‌ను కొన్ని నెలల క్రితం బెదిరించిన విషయం తెలిసిందే. దీన్ని అప్పట్లో మస్క్‌ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత రోగోజిన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తొలగించడం గమనార్హం. మరోవైపు మస్క్‌ నిత్యం అంగరక్షకుల పర్యవేక్షణలో ఉంటున్నారని ఎక్స్‌ ఉద్యోగులు కొన్ని నెలల క్రితం ఓ ప్రధాన మీడియా సంస్థతో అన్నారు. బహుశా కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు, కీలక మార్పుల నేపథ్యంలో ఆయనకు ఇది తప్పడం లేదోమోనని వారు అప్పట్లో వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని