EPFO interest rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లపై త్వరలో నిర్ణయం

EPFO interest rate: పీఎఫ్‌ చందాదారుల నగదు నిల్వలపై ఇచ్చే వడ్డీని త్వరలో నిర్ణయించనున్నారు. మార్చి 25, 26 తేదీల్లో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Published : 07 Mar 2023 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగ భవిష్యత్‌ నిధి సంస్థ (EPFO) అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల (CBDT) సమావేశం త్వరలో జరగనుంది. మార్చి 25, 26 తేదీల్లో నిర్వహించాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు సభ్యులకు ఇప్పటికే సమావేశం అందించింది. అయితే, ట్రస్టీల సమావేశం ప్రదేశం, ఎజెండా వివరాలు తెలియరాలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన వడ్డీ రేటుతో పాటు, అధిక పింఛను అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.1 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్‌పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను 8 శాతం కంటే తగ్గించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రెపో రేటు పెరిగిన కారణంగా ఇప్పటికే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. బోర్డు తీసుకోబోయే నిర్ణయంపై 6 కోట్ల మంది చందాదారులు వడ్డీ రేటుపై ఆసక్తిగా ఉన్నారు.

మరోవైపు అధిక పింఛనుపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల అధిక పింఛన్‌కు సంబంధించిన వెబ్‌లింక్‌ ఆప్షన్‌ ఇచ్చిన ఈపీఎఫ్‌వో.. 26 (6) నిబంధన పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోందని విమర్శలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో షరతులను తీవ్రంగా వ్యతిరేకించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇందుకు ఈ సమావేశం వేదిక అయ్యే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని