stock market: అప్రమత్తంగా అడుగులు వేయాలి

ఎన్నికల ఫలితాలపై స్టాక్‌మార్కెట్‌ అనూహ్యంగా స్పందించింది.  భాజపా సారథ్యంలో కేంద్రంలో మళ్లీ స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, స్టాక్‌మార్కెట్లకు ఇబ్బందేమీ ఉండదనే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు..

Updated : 05 Jun 2024 08:13 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన వ్యూహం 
వచ్చే కొద్ది రోజులు ఎంతో కీలకం 
స్టాక్‌మార్కెట్లపై  నిపుణుల విశ్లేషణ 

న్నికల ఫలితాలపై స్టాక్‌మార్కెట్‌ (Stock Market) అనూహ్యంగా స్పందించింది.  భాజపా సారథ్యంలో కేంద్రంలో మళ్లీ స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, స్టాక్‌మార్కెట్లకు ఇబ్బందేమీ ఉండదనే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. సోమవారం స్టాక్‌మార్కెట్‌ సూచీలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లాయి. ఫలితంగా షేర్ల విలువలూ అనూహ్యంగా పెరిగాయి. మంగళవారం వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక, సూచీలతో పాటు షేర్ల విలువలూ కుప్పకూలాయి. 400 సీట్లు వస్తాయని.. అందువల్ల జూన్‌ 4న ఎన్నికల ఫలితాల రోజు, సూచీలు భారీగా పెరుగుతాయంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో.. ముందుగానే షేర్లు కొని ఎదురుచూస్తున్న రిటైల్‌ మదుపర్ల ఆశలు నీరుగారి పోయాయి.

ఈ నేపథ్యంలో ‘స్టాక్‌మార్కెట్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి’ అనే సందేహాలు రిటైల్‌ మదుపర్లలో ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది, సమీప భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలు ఏవిధంగా ఉంటాయి.. అనే అంశాల ప్రభావం, కొద్ది కాలం పాటు దేశీయ స్టాక్‌మార్కెట్లపై అధికంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా మెలగడం ఎంతో అవసరమని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుంది కాబట్టి, మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం లేదని, అయినప్పటికీ జాగ్రత్తగా అడుగులు వేయడం మేలని పేర్కొంటున్నారు. 


ఈ అంశాలు గమనించాలి

  • స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పెరుగుతున్నప్పుడు అన్ని షేర్ల ధరలూ పెరగవు. కానీ సూచీలు పడిపోతుంటే మాత్రం, ఎక్కువ కంపెనీల షేర్ల ధరలు వేగంగా పతనం అవుతాయి. ఈ సూత్రాన్ని మదుపరులు గుర్తెరగాలి. 
  • షేర్లలో మదుపు చేసే ముందు ఆ షేరు వాస్తవ విలువ ఎంత, ధర ఎంత ఆకర్షణీయంగా ఉంది, అనేది చూసుకోవాలి. అంతేకానీ మార్కెట్‌ స్థాయిని కాదు.భావోద్వేగాల ప్రభావంతో మార్కెట్‌ పెరుగుతున్నప్పుడే చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. రాబడికి ఆస్కారం ఉన్నా, దాంతో పాటే సొమ్మును నష్టపోయే అవకాశాలూ పెరుగుతాయి.
  • మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతున్నప్పుడు ఒక షేరు ఎంత పెరుగుతుందనే చూస్తుంటారు. కానీ అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత నష్టపోతామనే విషయాన్ని పట్టించుకోరు.  మార్కెట్‌ పడుతున్నప్పుడు షేరు ధర ఇంకా ఎంత పతనం అవుతుందన్న దానిపై దృష్టి అధికంగా ఉంటుంది. కానీ, వాస్తవిక విలువకన్నా తక్కువకు దొరుకుతుందా, ఆ షేరు విలువ పెరిగేందుకు భవిష్యత్తు అవకాశాలను పరిగణనలోకి తీసుకోరు.
  • ఏ ఇతర పెట్టుబడి/పొదుపు పథకాలతో పోల్చినా దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్‌ అధిక రాబడినిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడి, ఎంతో మంది షేర్లను తెగనమ్ముకుని, నష్టాలను మూటగట్టుకుంటారు. సోమ, మంగళవారాల్లో మార్కెట్‌ను పరిశీలిస్తే స్వల్పకాలంలో మార్కెట్‌ పనితీరు ఎలా ఉంటుందన్నది స్పష్టమవుతుంది.
  • స్వల్ప/మధ్య కాలాల్లో మార్కెట్‌ నుంచి వచ్చే నష్టాలను తప్పించుకోవాలంటే దీర్ఘకాలిక దృక్పథంతో చేసే పెట్టుబడులే రక్ష.
  • మార్కెట్‌ గరిష్ఠ స్థాయుల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో తగ్గుతున్నప్పుడు మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే వదులుకోవద్దు. మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరంగా కదలాడుతూ, చక్కని వృద్ధిని అందించే షేర్లను పెట్టుబడి కోసం ఎంచుకోవడం ఉత్తమం.

ఎవరేమన్నారంటే.. 

లార్జ్‌ క్యాప్‌ షేర్లు మేలు

ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రస్తుత విధానాలనే కొనసాగించే పక్షంలో దీర్ఘకాలిక సానుకూలతకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రక్షణ, కేపిటల్‌ గూడ్స్‌.. తదితర రంగాలకు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో మేలు జరుగుతుంది. అయితే మదుపర్లు స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్‌ క్యాప్‌ షేర్లపై పెట్టుబడి మేలు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని నిలిచే శక్తి లార్జ్‌ క్యాప్‌ షేర్లకు ఉంటుంది.   

ప్రదీప్‌ గుప్తా, వైస్‌ఛైర్మన్, ఆనంద్‌ రాఠీ 


మూడు, నాలుగు దఫాలుగా పెట్టుబడి పెట్టండి 

ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేంద్రంలో మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టమవుతోంది. కొద్ది రోజుల పాటు ఫలితాల ప్రభావం, స్టాక్‌మార్కెట్‌పై ఉంటుంది. హెచ్చుతగ్గులు తప్పవు. కానీ తర్వాత ఆర్థిక వ్యవస్థ తీరు, వివిధ రంగాల పనితీరు, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైకి దృష్టి మళ్లుతుంది. మదుపర్లు స్థిరమైన వృద్ధి సాధిస్తున్న మంచి కంపెనీలపై మూడు, నాలుగు దఫాలుగా పెట్టుబడి పెట్టడం మంచిది.

అజయ్‌ మీనన్, ఎండీ-సీఈఓ (బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్‌), మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌


ఆర్థికాంశాలే కీలకం 

స్టాక్‌మార్కెట్‌కు ఆర్థికాంశాలే ముఖ్యం. ఇతర అంశాల ప్రభావం తాత్కాలికమే. ఆర్ధిక విధానాలు, జీడీపీ, ద్రవ్యోల్బణం, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులు.. తదితర అంశాలను పరిశీలించాలి. ప్రభుత్వం స్థిరమైన విధానాలు అనుసరిస్తే, స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులపై లాభాలు అధికంగా ఉంటాయి.

- సుమన్‌ బెనర్జీ, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్, హెడోనోవా


ప్రభుత్వం స్థిరంగా ఉండాలి 

బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడాలంటే కొన్ని ఇతర పార్టీలపై ఆధారపడాలి. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం పడుతుంది. సంస్కరణలను గతంలో మాదిరిగా బలంగా ముందుకు తీసుకువెళ్లలేకపోవచ్చు.

- సిద్ధార్థ ఖేమ్‌కా, సీనియర్‌ మేనేజర్, అబన్స్‌ హోల్డింగ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు