Microsoft: చైనా హ్యాకింగ్‌ నివారణలో మైక్రోసాప్ట్‌ నిర్లక్ష్యం: కీలక నివేదిక

Microsoft: చైనాకు చెందిన స్టార్మ్‌-0558 అనే గ్రూప్‌ చేసిన హ్యాకింగ్‌పై అమెరికా ప్రభుత్వ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ సైబర్‌ దాడి నివారించదగినదేనని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్లు ఆరోపించింది.

Published : 03 Apr 2024 12:48 IST

Microsoft | బోస్టన్‌: యూజర్ల భద్రతను కాపాడే విషయంలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తప్పిదాలకు పాల్పడినట్లు ఓ కీలక నివేదిక వెల్లడించింది. లోపాలను సవరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. ఫలితంగా చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్‌ నేరగాళ్లు అమెరికా అధికారులు, సంస్థల ఈమెయిల్‌ ఖాతాల్లో చొరబడ్డారని తెలిపింది. బాధితుల్లో అమెరికా వాణిజ్య కార్యదర్శి సైతం ఉన్నట్లు తేల్చింది. దీనివల్ల సున్నితమైన సమాచారం బయటకు వెళ్లి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

సైబర్‌ దాడులను అరికట్టేందుకు వివిధ కంపెనీలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకుగనూ బైడెన్‌ ప్రభుత్వం 2021లో ‘సైబర్‌ సేఫ్టీ రివ్యూ బోర్డు’ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) విధానాలు గందరగోళంగా ఉన్నాయని ఈ బోర్డు తేల్చింది. పైగా దాడులకు సంబంధించిన సమాచారం తెలుసా.. లేదా.. అనే విషయంలోనూ మైక్రోసాఫ్ట్‌ నిజాయతీగా వ్యవహరించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంపెనీ భద్రతా విధానాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. వాటిని పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. టెక్‌ రంగంలో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ కంపెనీ అనేక దేశాల జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను అందిస్తోందని గుర్తుచేసింది.

గత ఏడాది మే నుంచి జూన్‌ వరకు జరిగిన సైబర్‌ దాడులు నివారించదగినవేనని కమిటీ గుర్తించింది. మైక్రోసాఫ్ట్‌ వాటిని గుర్తించి సరిదిద్దడంలో విఫలమైందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠపరిచే వరకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు కొత్త ఫీచర్లను జత చేయొద్దని సిఫార్సు చేసింది. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని.. వాటికి సంబంధించిన టైమ్‌లైన్‌ను వెల్లడించాలని తెలిపింది. 22 సంస్థలు, 500 మంది కీలక వ్యక్తుల ఈమెయిళ్లను నేరగాళ్లు యాక్సెస్‌ చేశారని గుర్తించింది. ఆరు వారాల్లో ఒక్క విదేశాంగ శాఖకు చెందినవే దాదాపు 60 వేల ఈమెయిళ్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది.

స్టార్మ్‌-0558 అనే చైనా కంపెనీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఓ బ్లాగ్‌పోస్ట్‌ ద్వారా జులైలో వెల్లడించింది. అయితే, కచ్చితమైన సమాచారాన్ని మాత్రం పేర్కొనలేదు. హ్యాకర్లు చొరబడడానికి గల కారణాన్ని కూడా గుర్తించినట్లు తెలిపింది. అయితే, లోపం ఎక్కడుందో కంపెనీకి అప్పటికి తెలియదని తాజాగా బోర్డు తేల్చింది. నిరంతర ఒత్తిడి తర్వాత ఆ పోస్టును సవరించినట్లు తెలిపింది.

రివ్యూ బోర్డు నివేదికపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. బోర్డు చేసిన పరిశోధనను అభినందిస్తున్నామని తెలిపింది. సైబర్‌దాడులను నిలువరించేలా భద్రతా వ్యవస్థలను మరింత పటిష్ఠపరుస్తామని పేర్కొంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని