Budget 2024: మిషన్‌ టెక్‌.. ₹లక్ష కోట్లతో వారికి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు

టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల కోసం కంపెనీలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 

Updated : 01 Feb 2024 17:30 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ను (Union Budget 2024) ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్‌.. సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కార్పస్‌ నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో డీప్‌టెక్‌ను బలోపేతం చేసేందుకు కొత్త పథకాన్ని ప్రకటిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు ఇదో సువర్ణావకాశం అవుతుందని వెల్లడించారు.

‘‘అభివృద్ధికి ఆవిష్కరణలు పునాది. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనల కోసం టెక్‌ కంపెనీలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. దీని కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. దీంతో ప్రైవేటు, అంకుర సంస్థలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా 1.4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మరో 54 లక్షల మంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారన్నారు. 

మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్ శాస్త్రి ‘జై జవాన్‌, జై కిసాన్‌’ నినాదాన్ని చెబితే.. దానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ‘జై విజ్ఞాన్‌’ను జోడించారు. ప్రధాని మోదీ కొత్తగా వాటికి ‘జై అనుసంధాన్‌’ను కలిపారు

- నిర్మలా సీతారామన్‌

దేశీయ తయారీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కింద వివిధ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ఇందులో భాగంగా ఫాక్స్‌కాన్‌, శాంసంగ్‌, పెగాట్రాన్‌, రైజింగ్‌ స్టార్‌, విస్ట్రోన్‌, లావా, మైక్రోమాక్స్‌, ఆప్టిమస్‌ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరోవైపు సెమీ కండక్టర్‌, కృత్రిమ మేధ వంటి విభాగాల్లో పురోగతిని సాధించేందుకు ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణల కోసం నిధి ఏర్పాటు చేస్తూ కేంద్రం ప్రకటన చేయడం.. పీఎల్‌ఐ పథకానికి మరింత ఊతాన్నిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని