Hero-Harley bike: వచ్చే రెండేళ్లలో మార్కెట్‌లోకి హీరో-హార్లే బైక్‌

ప్రీమియం బైక్‌ల తయారీ కోసం హీరో మోటాకార్ప్‌ హార్లీ డేవిడ్‌సన్‌తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. తమ భాగస్వామ్యంలో తొలి బైక్‌ను వచ్చే రెండేళ్లలో విడుదల చేస్తామని ‘హీరో’ తెలిపింది.

Published : 28 Nov 2022 00:05 IST

దిల్లీ: హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి తాము సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న బైక్‌ రానున్న రెండేళ్లలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని హీరో మోటోకార్ప్‌ సీఎఫ్‌ఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. ఈ బైక్‌తో తమ ప్రీమియం మోటార్‌ సైకిళ్ల విభాగం బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బడ్జెట్‌ ద్విచక్రవాహన సెగ్మెంట్‌ (100-110సీసీ)లో ‘హీరో’ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రీమియం విభాగం (160సీసీ ఆపై)లోనూ తమ వాటాను పెంచుకునేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే హార్లేతో చేతులు కలిపింది. ఫలితంగా లాభదాయకతతో పాటు వాహన విక్రయాలను పెంచుకోవాలని చూస్తోంది.

హార్లే బైక్‌తో పాటే తమ సంస్థ స్వతహాగా తయారు చేయనున్న ప్రీమియం బైక్‌లను సైతం వచ్చే రెండేళ్లలోనే విడుదల చేస్తామని గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ప్రీమియం మోడళ్లను విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పాత తరం శైలి(రెట్రో స్టైలింగ్‌)తో హార్లే డేవిడ్‌సన్‌ మోడల్‌ను విపణిలోకి తీసుకొస్తామని 2020లో ఆ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సమయంలో హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రీమియం బైక్‌లను అభివృద్ధి చేసి హార్లే డేవిడ్‌సన్‌ బ్రాండ్‌తో హీరోమోటోకార్ప్‌ విక్రయిస్తుంది. సర్వీస్‌, విడిభాగాల అవసరాలనూ ఈ కంపెనీయే చూసుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు