Paytm వ్యవహారం.. ఆర్‌బీఐ నుంచి నివేదిక కోరిన ఈడీ, ఎఫ్‌ఐయూ!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వ్యవహారంలో ఈడీ, ఎఫ్‌ఐయూ ఆర్‌బీఐ నుంచి నివేదిక కోరాయి. నివేదికను అనుసరించి దర్యాప్తు సంస్థలు ముందుకెళ్లే అవకాశం ఉంది.

Published : 06 Feb 2024 22:04 IST

దిల్లీ: పేటీఎం (Paytm) పేమెంట్స్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (FIU) ఆర్‌బీఐ నుంచి నివేదిక కోరినట్లు తెలిసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద పేటీఎంలో ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనేది ఈ రెండు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తుంటాయి.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల అనంతరం పేటీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. పేటీఎం యజమాని వన్‌97 కమ్యూనికేషన్స్‌పై లేదా వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మపై ఈడీ దర్యాప్తేమీ లేదని అందులో తెలిపింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ నుంచి ఈడీ తాజా నివేదికను కోరింది. దాన్ని విశ్లేషించనుంది. అవసరమైతే పేమెంట్స్‌ బ్యాంక్‌పై దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. చైనా లోన్‌ యాప్స్‌కు సంబంధించి ఇప్పటికే పేటీఎం సహా ఇతర ఆన్‌లైన్‌ వ్యాలెట్లపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫిన్‌టెక్‌ల ద్వారా మర్చంట్‌ ఐడీలు క్రియేట్‌ చేసుకుని ఆయా యాప్స్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌బీఐ నివేదికను పరిశీలించాక పాత దర్యాప్తునే కొనసాగించడం లేదా కొత్తగా విచారణ ప్రారంభించడం చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13ను అనుసరించి ‘రిపోర్టింగ్‌ ఎంటిటీ’ నిబంధనలను పేటీఎం లేదా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పాటించిందా? లేదా? అనే దానిపై ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఆర్‌బీఐ నుంచి నివేదిక కోరింది. ఈ సెక్షన్‌ కింద బ్యాంక్‌ గానీ, సంబంధిత ఆర్థిక సంస్థ గానీ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను, క్లయింట్ల వివరాలు, లబ్ధిదారుల వివరాలను పూర్తిగా ఎఫ్‌ఐయూకు సమర్పించాల్సి ఉంటుంది. ఆయా నివేదికలను విశ్లేషించి ఆయా సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలకు చేరవేస్తుంది. ఎఫ్‌ఐయూ డైరెక్టర్‌కు పెనాల్టీ విధించే అధికారం కూడా ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఈ విభాగం పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని