Job Security: మా ఉద్యోగాలకు భద్రత లేదు.. సగం మంది భారతీయుల అభిప్రాయమిదే: సర్వే

దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది తమ కొలువులపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదని 47% ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్వే వెల్లడించింది.

Updated : 08 Jul 2023 07:23 IST

దిల్లీ: దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది తమ కొలువులపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదని 47% ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అభద్రత ఆందోళనకర అంశంగా మారుతోందని తెలిపింది. ‘పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2023: ఏ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వ్యూ’ పేరిట సంస్థ ఈ నివేదికను వెలువరించింది. అన్ని దేశాల్లోనూ ఉద్యోగాలపై అభద్రతాభావం  యువతలోనే ఎక్కువగా ఉంది. 32,000 మందికి పైగా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీపీ తెలిపింది. సగానికి పైగా జన్‌జడ్‌ (18-24 ఏళ్ల వయసు వారు) యువత తమ ఉద్యోగ భద్రతపై నమ్మకంతో లేరు. 55 ఏళ్లకు పైబడిన ఉద్యోగుల కంటే, ఈ అభిప్రాయం వీరిలో రెట్టింపు స్థాయిలో ఉంది.
* ‘ప్రతికూల, అనిశ్చితితో కూడిన పరిస్థితుల వల్ల ఉద్యోగులు తమ కొలువులపై కలవరపడుతున్నారు. కృత్రిమ మేధ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భారీగా సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి’ అని ఏడీపీ ఎండీ రాహుల్‌ గోయల్‌ తెలిపారు. నైపుణ్యం కలిగిన వారిని వెతకడం, కొనసాగించడంలో చాలా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొంత మంది భావిస్తున్నట్లు పరిస్థితి లేదని అన్నారు.
* భారత్‌లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉన్న రంగాల్లో స్థిరాస్తి, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించినవి ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. మీడియా, సమాచార పరిశ్రమలో ఈ తరహా వైఖరి కనిపించింది. ఆ తర్వాత ఆతిథ్యం, వినోద రంగాలున్నాయి. ఉద్యోగ భద్రత పెంచేందుకు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగా పనిచేసిన సమయానికి వేతనం ఇవ్వాలని 60% మంది అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు