Five Star Business IPO: ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఐపీఓ ధరల శ్రేణి ₹450-474

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫైవ్‌ స్టార్ బిజినెస్‌ ఫైనాన్స్‌ ఐపీఓ నవంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.450-474గా నిర్ణయించారు.

Published : 05 Nov 2022 00:51 IST

దిల్లీ: త్వరలో ఐపీఓకి రానున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫైవ్‌ స్టార్ బిజినెస్‌ ఫైనాన్స్‌ ధరల శ్రేణిని రూ.450-474గా నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. గరిష్ఠ ధర వద్ద రూ.1,960 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, కొటాక్ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఎడెల్‌వెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

దక్షిణ భారత్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌కు బలమైన నెట్‌వర్క్‌ ఉంది. ప్రధానంగా ఆస్తుల్ని తనఖా పెట్టుకొని ఇది రుణాలందిస్తుంటుంది. కన్జ్యూమర్‌, వాహన రుణాలే లక్ష్యంగా ఈ సంస్థ 1984లో కార్యకలాపాల్ని ప్రారంభించింది. 2005లో చిన్న వ్యాపారాలకు రుణాలివ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా పట్టణ, సెమీ- అర్బన్ ప్రాంతాలపై ఇది దృష్టి సారించింది. కంపెనీ వ్యాపారంలో 85శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఉంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 150 జిల్లాల్లో 311 శాఖలు ఉన్నాయి. 6,077 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2018వ ఆర్థిక సంవత్సరంలో 33,157గా ఉన్న క్రియాశీల ఖాతాల సంఖ్య ఈ ఏడాది జూన్‌ నాటికి 2.3 లక్షలకు పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 19.49 శాతం పెరిగి రూ.1,256.16 కోట్లకు చేరింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన రూ.358.99 కోట్ల నుంచి రూ.453.54 కోట్లకు చేరింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2022 మార్చి 31 నాటికి రూ.5,100 కోట్లకు పెరిగింది. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, వెరిటాస్‌ ఫైనాన్షియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, హోంఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వంటి సంస్థలతో పోటీపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు