Flair Writing Listing: ఫ్లెయిర్‌ రైటింగ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. ఒక్కో లాట్‌పై రూ.9,653 లాభం

Flair Writing Listing: ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఐపీఓలో అలాట్ అయినవారు కనీసం 49 షేర్లపై రూ.14,896 పెట్టుబడిగా పెట్టారు.

Updated : 01 Dec 2023 13:13 IST

ముంబయి: ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ ‘ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌’ షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఈ మధ్య ఐపీఓకి వచ్చిన ఇతర కంపెనీల తరహాలోనే ఫ్లెయిర్‌ సైతం మదుపర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇష్యూ ధర రూ.304తో పోలిస్తే దాదాపు 65 శాతం లాభంతో షేర్లు లిస్టయ్యాయి (Flair Writing Listing). బీఎస్‌ఈలో రూ.503 దగ్గర, ఎన్‌ఎస్‌ఈలో రూ.501 దగ్గర ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ లిస్టింగ్‌లో రూ.4,771 కోట్లుగా నమోదైంది.

ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు కనీసం 49 షేర్లపై రూ.14,896 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వీరు కనీసం రూ.9,653 లిస్టింగ్‌ లాభాలను పొందారు. ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ (Flair Writing IPO)కు మొత్తంగా 46.68 రెట్ల స్పందన కనిపించింది. ఇష్యూలో భాగంగా 1,44,13,188 షేర్లు జారీ చేయగా, 67,28,33,455 షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. మొత్తం రూ.593 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకి రాగా.. దాదాపు రూ.20,000 కోట్లు విలువ చేసే షేర్లకు బిడ్లు అందాయి. క్యూఐబీ విభాగంలో 115.60 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 33.37 రెట్లు, రిటైల్‌ విభాగంలో 13.01 రెట్ల స్పందన వచ్చింది. 

ఐపీఓ (Flair Writing IPO) ద్వారా సమకూరిన నిధులను కంపెనీ గుజరాత్‌లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఉపయోగించనుంది. మరికొన్ని నిధులను నిర్వహణ మూలధన అవసరాలకు వాడుకోనున్నట్లు తెలిపింది. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకూ కొన్ని నిధులను కేటాయిస్తామని వెల్లడించింది. ‘ఫ్లెయిర్‌’ బ్రాండ్‌తో 45 ఏళ్లుగా ఈ కంపెనీ పెన్నులను విక్రయిస్తోంది. 2023 నాటికి తొమ్మిది శాతం మార్కెట్ వాటాతో తొలి మూడు అగ్రగామి కంపెనీల జాబితాలో ఉంది. పెన్నులు, కాలిక్యులేటర్లు సహా ఇతర స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇటీవల గృహ వినియోగ వస్తువులు, స్టీల్‌ బాటిళ్ల తయారీలోకీ ప్రవేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని