Flipkart: భారత ఈ-కామర్స్‌లో 48% మార్కెట్‌ వాటాతో ఫ్లిప్‌కార్ట్‌ ముందంజ!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్‌ విభాగాలదే అధిక వాటా అని అలయన్స్‌బెర్న్‌స్టెయిన్‌ నివేదిక తెలిపింది.

Updated : 26 Jan 2024 12:21 IST

దిల్లీ: వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) భారత మార్కెట్‌లో 48 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు అలయన్స్‌బెర్న్‌స్టెయిన్‌ నివేదిక తెలిపింది. మీషో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ కంపెనీగా నిలిచినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల సంఖ్య 21 శాతం పెరిగింది. మీషో 32 శాతం, అమెజాన్‌ 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పోటీ సంస్థలతో పోలిస్తే ఖరీదైన వస్తువులను ఎక్కువగా విక్రయిస్తుండడం వల్లే అమెజాన్‌ వృద్ధి నెమ్మదించినట్లు పేర్కొంది.

‘‘ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్‌ విభాగాలదే అధిక వాటా. ఆన్‌లైన్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో 48 శాతం, ఫ్యాషన్‌ విభాగంలో 60 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీదే. సున్నా కమీషన్‌, టైర్‌-2 సహా చిన్న పట్టణాలపై దృష్టి సారించడమే మీషో (Meesho) వృద్ధికి ప్రధాన కారణం. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆర్డర్ల సంఖ్య 43 శాతం పెరిగింది. ఆదాయం 54 శాతం పుంజుకుంది. ఒకసారి కొన్నవారిలో 80 శాతం వినియోగదారులు మీషోను తిరిగి ఆశ్రయిస్తున్నారు. ఈ వేదికపై 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారులే. అమ్ముడవుతున్న వస్తువుల్లో 95 శాతం బ్రాండెడ్‌ కానివే. కంపెనీ ‘స్థూల సరకుల విలువ (GMV)’ ఐదు బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. దీంట్లో 50 శాతం దుస్తులు, 8-10 శాతం బీపీసీ (beauty and personal care), 8-10 శాతం హోమ్‌ అండ్‌ కిచెన్‌ విభాగాల నుంచే వస్తోంది’’ అని బెర్న్‌స్టెయిన్‌ నివేదిక తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 1100 ఉద్యోగాల కోత

ఫ్యాషన్‌ ఈ-కామర్స్‌లో రిలయన్స్‌కు చెందిన అజియో వేగంగా కస్టమర్లను సంపాదించుకుంటోందని నివేదిక వెల్లడించింది. నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో 30 శాతం వాటా ఈ కంపెనీదే. మార్కెట్‌ వాటాపరంగా మాత్రం 50 శాతంతో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా తొలిస్థానంలో ఉంది. 2023 డిసెంబర్‌లో పోటీ సంస్థలతో పోలిస్తే అత్యధికంగా 25 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం విక్రయాలు నెమ్మదించాయి. ఈ-గ్రాసరీ విభాగంలో జీఎంవీపరంగా 40 శాతం వాటాతో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా బ్లింకిట్‌ నిలిచింది. ఇన్‌స్టామార్ట్‌ 37-39 శాతం, జెప్టోకు 20 శాతం వాటా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని