Flipkart: రెండేళ్లలో రూ.41,000 కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్‌ విలువ!

Flipkart: మాతృసంస్థ వాల్‌మార్ట్‌ ఈక్విటీ లావాదేవీల ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌ విలువ గత రెండేళ్లలో రూ.41 వేల కోట్లు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం దీన్ని తప్పుబట్టింది. ఫోన్‌పే వేరుపడిన తర్వాత కంపెనీ విలువ పెరిగిందని.. దాన్ని వాల్‌మార్ట్‌ సర్దుబాటు చేయలేదని వివరించింది.

Published : 17 Mar 2024 18:59 IST

దిల్లీ: ప్రముఖ దేశీయ ఈ - కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) విలువ రెండేళ్లలో రూ.41,000 కోట్లు కుంగింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న దాని మాతృసంస్థ వాల్‌మార్ట్‌ ఈక్విటీ లావాదేవీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. 2022 జనవరిలో కంపెనీ విలువ 40 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. అది ఈ ఏడాది తొలి నెల నాటికి 35 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది. ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే వేరుపడడం వల్లే ఫ్లిప్‌కార్ట్‌ విలువ తగ్గిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

2022లో ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) విలువను 40 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసిన వాల్‌మార్ట్‌ 3.2 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎనిమిది శాతం ఈక్విటీ వాటాలను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 3.5 బిలియన్‌ డాలర్లు చెల్లించి సంస్థలో మరో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో దాని వాటా 85 శాతానికి చేరింది. ఫలితంగా ఈ - కామర్స్‌ సంస్థ విలువ 35 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అయితే, వాల్‌మార్ట్‌ అంచనాలను ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) తప్పుబట్టింది. 2023లోనే ఫోన్‌పే వేర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు పెరిగిన విలువను వాల్‌మార్ట్‌ తమ సమాచారంలో అప్‌డేట్‌ చేయలేదని పేర్కొంది. చివరిసారి తమ కంపెనీ విలువను 2021లో అంచనా వేసినట్లు గుర్తుచేసింది. అప్పుడు ఫోన్‌పేను కూడా కలిపి మదింపు చేసినట్లు వెల్లడించింది.

జనరల్‌ అట్లాంటిక్‌, టైగర్‌ గ్లోబల్‌, రిబ్బిట్‌ క్యాపిటల్‌, టీవీఎస్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ వంటి సంస్థల నుంచి ఫోన్‌పే 850 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. దీంతో దాని విలువ 12 బిలియన్‌ డాలర్లకు చేరింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ స్థూల విక్రయాల విలువ (GMV) 2023లో వార్షిక ప్రాతిపదికన 25 శాతం నుంచి 28 శాతం పెరిగి... 29 నుంచి 30 బిలియన్‌ డాలర్లకు చేరిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని వల్ల కంపెనీ విలువ గణనీయంగా పెరిగి 38 నుంచి 40 బిలియన్‌ డాలర్లకు చేరి ఉంటుందని వివరించాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్‌ రూ.56,012 కోట్ల ఏకీకృత నికర ఆదాయం, రూ.4,846 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యయాలు రూ.60,858 కోట్లుగా నివేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని