Budget 2023: ఇక ‘పాన్‌’ ఒక్కటే చాలు..!

Budget 2023: ఈ సారి బడ్జెట్‌లో వ్యాపారాలన్ని మరింత సులువు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపార సంస్థలు 10కిపైగా ఐడీ కార్డులను ఉపయోగించాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది.

Updated : 01 Feb 2023 16:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో వాణిజ్య వాతావరణాన్ని (Ease of doing business) మరింత మెరుగు పర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నిబంధనల చట్రాల్లో కొంత వెసులుబాటును తీసుకొచ్చింది. పదికి పైగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాల్సిన ఇబ్బంది నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి లభించింది. దీంతోపాటు గత డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘జన్‌ విశ్వాస్‌’ బిల్లుకు (Jana vishwas bill) అనుగుణంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ బిల్లు జాయింటు పార్లమెంటరీ కమిటీ ఎదుట ఉంది. భారత్‌లో వ్యాపారం చేయాలంటే వివిధ రకాల చట్టాల కింద ఉండే వేల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల చిన్న నిబంధనలు ఉల్లంఘించినా క్రిమినల్‌ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను భయపెడుతోంది. ఇవి పెట్టుబడులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. దేశంలో సంస్కరణలు జరిగే కొద్దీ ఇటువంటి నిబంధనలను తొలగించి వ్యాపారాలను ప్రభుత్వాలు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. తాజాగా బడ్జెట్‌ 2023లో (Budget 2023) దాదాపు 39,000 నిబంధనలను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) ప్రకటించారు. అంతేకాదు.. 3,400 రకాల చిన్నచిన్న ఉల్లంఘనలను డీక్రిమినలైజ్‌ చేశారు. అంటే ఆ నేరాలకు జైలు శిక్షలు కాకుండా అపరాధ రుసుము వంటి చర్యలతో సరిపెడతారు. 

13 రకాలకుపైగా గుర్తింపు కార్డులకు  బదులు పాన్‌ (PAN) ఒక్కటే..

వ్యాపారాలకు ఇక నుంచి PAN కార్డ్‌ అత్యంత ముఖ్యమైనదిగా మారిపోనుంది. ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని పలు రకాల డిజిటల్‌ వ్యవస్థలు ఇక PAN కార్డును గుర్తింపు కార్డుగా స్వీకరించనున్నాయి. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు EPFO, ESIC, GSTN, TIN, TAN, PAN వంటి వాటిని చూపి అనుమతుల తెచ్చుకొంటున్నాయి. కానీ, ఇక నుంచి PAN ఒక్కదానినే అంగీకరిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది ఒక అడుగని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.   

ఏమిటీ జన విశ్వాస్‌ బిల్లు..

కేంద్రం మొత్తం 42 చట్టాల్లోని నిబంధనలను తొలగించి వ్యాపారాలను మరింత సరళంగా మార్చాలని ఈ బిల్లులో నిర్ణయించారు.  దీని ప్రకారం పోస్టాఫీస్‌ చట్టం-1898, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, పబ్లిక్‌ లైబిలిటీ ఇన్స్యూరెన్స్‌ చట్టం-1991, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌-2000 వంటివి వీటిల్లో ఉన్నాయి. ఈ చట్టాల్లో ఉన్న కొన్నిరకాల నేరాలకు జైలుశిక్ష వరకు విధిస్తారు. అటువంటి వాటిని నేరాల జాబితా నుంచి తప్పించి అపరాధ రుసుంతో సరిపెట్టనున్నారు. అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ (గ్రేడింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌) యాక్ట్‌-1937 కింద నకిలీ గ్రేడింగ్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 ఫైన్‌ విధిస్తారు. కానీ, కొత్త బిల్లు ప్రకారం అదే నేరానికి రూ.8 లక్షల ఫైన్‌ విధిస్తారు.  

కంపెనీల చట్టం-2013 కింద ఉన్న చిన్నచిన్న ఆర్థిక నేరాలను డీక్రిమినలైజ్‌ చేస్తే.. 4,00,000 కంపెనీలు తాము పాల్పడిన నిబంధనల ఉల్లంఘనలను సరిచేసుకోవడానికి సానుకూలంగా ఉన్నాయని 2022-23 ఆర్థిక సర్వే తెలిపింది. ఈ క్రమంలోనే 3,400 నేరాలను డీక్రిమినలైజ్‌ చేసింది. 

స్టార్టప్‌ల కోసం సరికొత్త డేటా గవర్నెన్స్‌పాలసీ..

స్టార్టప్‌లు, విద్యాసంస్థల్లో సృజనాత్మక-పరిశోధనలను ప్రోత్సహించేలా కీలక డేటాను వాడుకొనేందుకు వీలుగా నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ పాలసీని ప్రభుత్వం తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 2022లో ఐటీ శాఖ నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ పాలసీ(ఎన్‌డీజీఎప్‌పీ) ముసాయిదాను జారీ చేసింది. దీని ప్రకారం స్టార్టప్‌లు, పరిశోధనల కోసం భారత్‌కు సంబంధించిన వ్యక్తిగతేతర డేటా నిధిని ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తుంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఐ) ప్రతి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో ఏఐఎంఐకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు డేటా దొరకడం. ఏదైనా ఒక ఆల్గారిథమ్‌ను పరీక్షించాలన్నా భారీ స్థాయిలో డేటా అవసరం. 

వివాద్‌ సే విశ్వాస్‌..

ఈ సారి బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల కాంట్రాక్ట్‌ వివాదాల పరిష్కారం కోసం వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను, వడ్డీ, జరిమానా, ఫీజుల అంశంలో వివాదాలను పరిష్కరించేందుకు దీనిని తీసుకొచ్చారు. నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆశాదీపం వలే ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని