Tim Cook: శాంసంగ్‌ను దాటేసిన యాపిల్‌.. టిమ్‌ రియాక్షన్ ఇదే

ఆదాయపరంగా భారత్‌లో యాపిల్‌ గత త్రైమాసిక రికార్డులను అధిగమించిందని టిమ్‌ కుక్‌ తెలిపారు.

Updated : 02 Feb 2024 14:35 IST

దిల్లీ: యాపిల్‌ (Apple) సంస్థ తాజాగా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) భారత్‌లో కంపెనీ పనితీరుపై స్పందించారు. ఆదాయపరంగా గత త్రైమాసికాల రికార్డును అధిగమించినట్లు తెలిపారు. ఇది భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తుందన్నారు. ఆదాయంలో శాంసంగ్‌ను యాపిల్‌ దాటేసిందని కొద్దిరోజుల క్రితం కౌంటర్‌ పాయింట్‌ అనే టెక్నాలజీ మార్కెట్‌ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. దీనిపై తాజాగా టిమ్‌ స్పందించారు. 

‘‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, పోలండ్‌, తుర్కియే, ఇండోనేసియా, సౌదీ అరేబియా, చిలీ సహా భారత్‌లోనూ డిసెంబరు త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి’’ అని తెలిపారు. గత ఏడాదిలో కోటి యూనిట్ల సరఫరాతో తొలిసారిగా ఆదాయపరంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొన్నేళ్లుగా భారత్‌ మార్కెట్‌పై దృష్టిసారించిన యాపిల్‌.. దిల్లీ, ముంబయి నగరాల్లో స్టోర్‌లను ప్రారంభించింది. 2027 నాటికి మరో మూడు చోట్ల ఏర్పాటు చేయనుంది. అమెరికా, యూరప్‌ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో వీటిని నెలకొల్పనున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని