Nirmala Sitharaman: వరుసగా ఐదోసారి.. ఫోర్బ్స్‌ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్‌

ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా ఐదో సారి చోటు లభించింది. 

Updated : 06 Dec 2023 15:34 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది. భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా.. వారిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్‌ తర్వాత భారత్‌ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా (Roshni Nadar Malhotra) (60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAIL) ఛైర్‌పర్సన్ సోమా మోండల్‌ (Soma Mondal) (70వ స్థానం), బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా (Kiran Mazumdar-Shaw) (76వ స్థానం)లకు వరుసగా ఈ ఏడాది కూడా జాబితాలో చోటు దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ (Ursula von der Leyen) తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతి క్రిస్టినా లగార్డ్‌ (Christine Lagarde), మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) ఉన్నారు. నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni), ఐదులో అమెరికా గాయని టేలర్‌ స్విప్ట్‌ (Taylor Swift) చోటు దక్కించుకున్నారు. 

  • భారత్‌లో తొలి, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌, రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. 
  • హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ కుమార్తె రోష్నీ నాడార్‌ మల్హోత్రా. జులై 2020లో హెచ్‌సీఎల్ ఛైర్‌పర్స్‌నగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అగ్ర పథంలో నడిపిస్తున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. గతేడాది ఈ జాబితాలో ఆమె 53వ స్థానంలో ఉన్నారు. 
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెయిల్‌కి తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా సోమా మోండల్‌ 2021లో బాధ్యతలు చేపట్టారు. సెయిల్‌ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఆమె ఛైర్‌పర్సన్‌ అయ్యాక కంపెనీ లాభాలు మూడు రెట్లు పెరిగినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. గతేడాది ఆమె 67వ స్థానంలో నిలిచారు.
  • 1978లో కిరణ్‌ మజూందర్‌ షా బయోకాన్‌ను నెలకొల్పారు. ఆ తర్వాతి కాలంలో ఆమె భారత్‌లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఎదిగారు. బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతి పెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ ఉంది. గతేడాది 72వ స్థానంలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని