Foxconn: రూ.300 కోట్లతో బెంగళూరులో స్థలం కొన్న ఫాక్స్‌కాన్‌

Foxconn: భారత్‌లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్న ఫాక్స్‌కాన్‌ తాజాగా బెంగళూరు శివారులో పెద్ద మొత్తంలో స్థలాన్ని కొనుగోలు చేసింది.

Published : 09 May 2023 15:38 IST

బెంగళూరు: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) బెంగళూరు శివారులో పెద్ద మొత్తంలో స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. చైనా వెలుపలకు తయారీ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫాక్స్‌కాన్‌ భారత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

యాపిల్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతున్న ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్‌ (Foxconn) ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ కార్యకలాపాలు చైనాలో కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ, అక్కడ తలెత్తిన వివిధ సమస్యల వల్ల తయారీని ఇతర దేశాలకు విస్తరిస్తోంది. భారత్‌లో వ్యాపార విస్తరణకు అపార అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్న యాపిల్‌ సైతం ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారించింది.

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న దేవణహళ్లి ప్రాంతంలో 1.2 మిలియన్‌ చదరపు మీటర్ల స్థలాన్ని ఫాక్స్‌కాన్‌ (Foxconn) కొనుగోలు చేసింది. దీని కోసం అనుబంధ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌ హాన్‌ హాయ్‌ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్‌’ దాదాపు రూ.300 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మరోవైపు వియత్నాంలోనూ ఫాక్స్‌కాన్‌ (Foxconn) 4,80,000 చదరపు మీటర్ల స్థలం కొనుగోలు చేసింది.

త్వరలోనే రాష్ట్రంలో కొత్త తయారీ కేంద్రంలో యాపిల్‌ తమ ఐఫోన్లను తయారు చేయనుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మార్చిలో ప్రకటించారు. దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు అదే సమయంలో కర్ణాటకలో ఫాక్స్‌కాన్‌ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ ఆ రాష్ట్రంలో పర్యటించారు. సెమీకండరక్టర్‌ అభివృద్ధి సహా విద్యుత్‌ వాహనాల తయారీ వంటి రంగాల్లో కర్ణాటక ప్రభుత్వ సహకారాన్ని కోరారు. తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని