ఎన్నికల ఫలితాలు.. ₹14,800 కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి

FPIs: ఎన్నికల ఫలితాల తర్వాత విదేశీ సంస్థాగత మదుపరులు రూ.14,800 కోట్లను దేశీయ స్టాక్‌మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు.

Updated : 09 Jun 2024 19:20 IST

FPIs | ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశీ సంస్థాగత మదుపర్లు (Foreign Investors) పెద్దఎత్తున పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.. అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెల మొదటి వారంలో ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి దాదాపు రూ.14,800 కోట్లను వెనక్కి తీసుకున్నారు.

మారిషస్‌తో భారత్‌కున్న పన్ను ఒప్పందాన్ని సవరిస్తారన్న ఆందోళనలు, అమెరికా బాండ్ రాబడుల్లో స్థిరమైన పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా ఏకంగా రూ.25,586 కోట్లను మార్కెట్‌ నుంచి తరలించారు. మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో నికరంగా రూ.1,539 కోట్లు పెట్టుబడులు పెట్టారు. జనవరిలో రూ.25,743 కోట్లను వెనక్కితీసుకున్నారు. ఈ నెల జూన్‌ 7 నాటికి నికరంగా రూ.14,794 కోట్ల డబ్బును మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు.

ఆయనే లేకుంటే టెస్లా ఇలా ఉండేది కాదేమో..! భారత సంతతి వ్యక్తిపై మస్క్‌ ప్రశంసలు

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. దీంతో మార్కెట్‌ బాగా రాణించింది. తీరా ఫలితాలు అందుకు భిన్నంగా రావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు నష్టాలు చవిచూశాయి. ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల విదేశీ పెట్టుబడుదారులు ఆందోళన చెందుతున్నారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉండటంతో పెట్టుబడులు అక్కడికి తరలి వెళ్లాయంటున్నారు.

మరోవైపు డెట్ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. మార్చిలో రూ.13,602 కోట్లు, ఫిబ్రవరిలో రూ.22,419 కోట్లు, జనవరిలో రూ.19,836 కోట్లు పెట్టారు. జేపీ మోర్గాన్‌ సూచీలో భారత ప్రభుత్వ బాండ్లు చేరడంతో ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇలా మొత్తంగా 2024లో ఎఫ్‌పీఐలు ఇప్పటివరకు ఈక్విటీల నుంచి రూ.38,158 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహించుకోగా.. డెట్‌ మార్కెట్లో రూ.57,677 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని