FPIs: రెండు నెలల విరామం తర్వాత మళ్లీ అమ్మేశారు!

విదేశీ మదుపర్ల వరుస తొమ్మిది నెలల పెట్టుబడుల ఉపసంహరణకు జులై, ఆగస్టులో బ్రేక్ పడింది. తిరిగి సెప్టెంబరులో మళ్లీ నికర అమ్మకందారులుగా నిలిచారు.

Published : 02 Oct 2022 19:28 IST

దిల్లీ: రెండు నెలల విరామం తర్వాత విదేశీ మదుపర్లు (FPI) సెప్టెంబరులో తిరిగి నికర అమ్మకందారులుగా నిలిచారు. రూపాయి భారీ పతనం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన నిర్ణయాల నేపథ్యంలో దాదాపు రూ.7,600 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022లో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు భారత్‌ నుంచి రూ.1.68 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. వచ్చే కొన్ని నెలల పాటు పలు అంతర్జాతీయ, దేశీయ పరిణామాల వల్ల భారత్‌లోకి ఎఫ్‌పీఐల ప్రవాహం అస్థిరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నట్లు కొటాక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ విభాగాధిపతి శ్రీకాంత్‌ చౌహాన్ తెలిపారు. ఈ సమయంలో యూకే ప్రభుత్వం అవలంబిస్తున్న ద్రవ్య విధానాలు ప్రధాన కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు.  దేశీయంగా ఇంధన సంబంధిత ఇబ్బందులతో పాటు జీడీపీ అంచనాల్లో కోత ఈక్విటీ మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. డిపాజిటరీల సమాచారం ప్రకారం.. సెప్టెంబరులో ఎఫ్‌పీఐలు రూ.7,624 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఆగస్టులో రూ.51,200 కోట్లు, జులైలో రూ.5,000 కోట్లు దేశీయ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టిన విషయం తెలిసిందే. అంతక్రితం వరుసగా ఎనిమిది నెలల పాటు వీరు భారీ ఎత్తున నిధుల్ని వెనక్కి తీసుకున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు కఠిన నిర్ణయాలు, రూపాయి పతనం, యూఎస్‌ బాండ్లపై వడ్డీలు పెరగడం, ఆర్థిక మాంద్యం భయాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతుండడం కూడా ప్రభావం చూపింది. ఆగస్టు నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి 8.3 శాతంగా నమోదు కావడం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ఫెడ్‌ వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అలాగే మున్ముందు మరింత పెంచుతామని స్పష్టం చేసింది. ఫలితంగా ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను ఓ కదుపు కుదిపింది. దీనికి కరెన్సీల పతనం కూడా జతయ్యింది. సెప్టెంబరులో డాలర్‌ విలువ గణనీయంగా పెరిగింది. అమెరికాలో వడ్డీరేట్లు కూడా పెరగడంతో ఎఫ్‌పీఐలు అమెరికా స్థిర ఆదాయ మార్గాల్లోకి తమ పెట్టుబడులను మళ్లించడానికి మొగ్గుచూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు