Sam Bankman Fried: ‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’గా పేరొందాడు.. చివరకు దోషిగా తేలాడు!

Sam Bankman Fried | క్రిప్టో ఎక్స్చేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు న్యూయార్క్‌ కోర్టు తేల్చింది.

Updated : 03 Nov 2023 13:24 IST

న్యూయార్క్‌: క్రిప్టోకరెన్సీ పరిశ్రమలో శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌ (Sam Bankman Fried)ది ఓ ప్రత్యేక అధ్యాయం. అయితే, ఆయన ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనాన్ని చవిచూశారు. ఖరీదైన వాణిజ్య ప్రకటనలు, నిత్యం అత్యున్నతస్థాయి వ్యాపారులు, రాజకీయ నాయకులతో సమావేశాలు, భవిష్యత్‌లో అగ్రరాజ్య అధ్యక్షుడవుతాడనే అంచనాలు.. ఇవన్నీ గురువారం న్యూయార్క్‌లోని ఓ కోర్టు తీర్పుతో అడుగంటిపోయాయి. ఆర్థిక మోసం, అక్రమ నగదు చలామణిలో ఆయనను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఒకప్పుడు ‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’గా పేరొందిన ఆయన ఇప్పుడు జైలులో గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎవరీ బ్యాంక్‌మన్‌?

2017లో వాల్‌ స్ట్రీట్‌లో ఉద్యోగం వదిలేసి అలమెడా రీసెర్చ్‌ పేరిట హెడ్జ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌ (Sam Bankman Fried). ఆయన తల్లిదండ్రులు స్టాన్‌ఫోర్డ్‌ లా స్కూల్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఎఫ్‌టీఎక్స్‌ పేరుతో క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌ను నెలకొల్పారు. తర్వాత రెండేళ్ల పాటు క్రిప్టోలో భారీ ర్యాలీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం బ్యాంక్‌మన్‌ సంపద 26 బిలియన్‌ డాలర్లకు చేరింది. అప్పటికీ ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు. తన సంపదతో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2022 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేశారు. బహమాస్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్‌మన్‌.. తనదైన ఆహార్యంతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. బిల్‌ క్లింటన్‌ వంటి హేమాహేమీలతోనూ ఆయన షార్ట్స్‌ ధరించి సమావేశమయ్యేవారు.

క్రిప్టోకరెన్సీపై తొలి నుంచీ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇది సురక్షితమైన పెట్టుబడి మార్గమని చెప్పడం కోసం బ్యాంక్‌మన్‌ (Sam Bankman Fried) భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం హాలీవుడ్‌కు చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలను రంగంలోకి దింపారు. వారికి పెద్ద మొత్తం చెల్లించేందుకూ వెనుకాడలేదు. 

ఇదీ జరిగిందీ..

అసలు వివాదం ఎఫ్‌టీఎక్స్‌, అలమెడా రీసెర్చ్‌ మధ్య సంబంధంతోనే మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్‌మన్‌ (Sam Bankman Fried) చెప్పేవారు. కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది. ఈ విషయాన్ని కాయిన్‌డెస్క్‌ అనే వెబ్‌సైట్‌ బహిర్గతం చేసింది. అలమెడా ఆస్తుల్లో చాలా వరకు ఎఫ్‌టీఎక్స్‌ ఆవిష్కరించిన ఎఫ్‌టీటీ క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. మార్కెట్‌ విలువ ప్రకారం తమ ఎఫ్‌టీటీ టోకెన్ల విలువ బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ ఇరు సంస్థల అధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్‌లో ఉన్నవి చాలా తక్కువ. అంటే అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమే.

ఈ విషయం బయటకు రాగానే ఎఫ్‌టీఎక్స్‌ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న ఎఫ్‌టీటీ టోకెన్లను అన్నింటినీ విక్రయించేసింది. దీంతో మిగతా ట్రేడర్లు సైతం తమ ఎఫ్‌టీటీ హోల్డింగ్స్‌ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా ఎఫ్‌టీటీ విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది. మరోవైపు ఎఫ్‌టీఎక్స్‌ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ, కస్టమర్లు, ఇన్వెస్టర్ల ఫండ్లను అప్పటికే ఎఫ్‌టీఎక్స్‌ అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా కిందకు తరలించింది. తద్వారా అలమెడా నష్టాలను పూడ్చేందుకు ప్రయత్నించారు. అలాగే రాజకీయ విరాళాలు, బహమాస్‌లో విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ కోసం వినియోగించారు. కానీ, మదుపర్లు ఒక్కసారిగా విత్‌డ్రాలకు ఎగబడడంతో ఎఫ్‌టీఎక్స్‌ వద్ద మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేవు. మరోవైపు అలమెడా దగ్గర ఉన్న టోకెన్లకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా ఎఫ్‌టీఎక్స్‌ దివాలా పరిష్కార ప్రణాళికకు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంలో బ్యాంక్‌మన్‌తో పాటు మరో ముగ్గురూ ఉన్నారు. వారంతా తప్పులను కోర్టు ముందు అంగీకరించారు. బ్యాంక్‌మన్‌ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు తెలిపారు. కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్‌మన్‌ దోషిగా తేలారు. దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్థిక నేరం సంభవించినట్లు తేల్చారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని కోర్టు వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని