Gandhar Oil Refinery IPO: ఐపీఓకి గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ.. సెబీకి దరఖాస్తు

గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ ఐపీఓకి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు సెబీ ప్రాథమిక పత్రాలు సమర్పించింది.

Published : 24 Dec 2022 00:16 IST

దిల్లీ: ‘గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్‌’ ఐపీఓ (Gandhar Oil Refinery India Limited IPO)కి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో రూ.357 కోట్లు విలువ చేసే తాజా షేర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 1.2 కోట్ల షేర్లను వదులుకోనున్నారు. ఈ ఐపీఓకు ఎడిల్‌వైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ మర్చంట్‌ బ్యాంకర్లుగా కంపెనీ నియమించుకుంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించిన నిధులతో కొంత భాగాన్ని రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగించుకోనున్నారు. మరికొన్ని నిధుల్ని ఉపకరణాల కొనుగోలుకు వాడనున్నారు. అలాగే సిల్వస్సా ప్లాంట్‌ సామర్థ్యాన్ని విస్తరించేందుకు కావాల్సిన పనులకు కూడా కొన్ని నిధుల్ని వినియోగించనున్నారు. తలోజా ప్లాంట్‌లోని పెట్రోలియం జెల్లీ, కాస్మెటిక్‌ ప్రోడక్ట్‌ డివిజన్లను, వైట్‌ ఆయిల్స్‌ సామర్థ్యం పెంపును కూడా చేపట్టనున్నారు. మిగిలిన నిధుల్ని నిర్వహణ మూలధన వ్యయం కింద వినియోగించుకోనున్నారు.

కన్జ్యూమర్‌, హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీస్‌కు కావాల్సిన వైట్‌ ఆయిల్స్‌ను ‘గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ’ ఉత్పత్తి చేస్తోంది. 2022 జూన్‌ 30 నాటికి వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, పెర్ఫార్మెన్స్‌ ఆయిల్స్‌; ల్యూబ్రికెంట్స్‌; దివ్యోల్‌ బ్రాండ్‌ పేరిట ఇన్సులేటింగ్‌, ప్రాసెస్‌ ఆయిల్స్‌ను సైతం తయారు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని