సంక్షిప్త వార్తలు

అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్‌ను టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మంగళవారం విడుదల చేసింది.

Published : 30 Nov 2022 02:10 IST

టీవీఎస్‌ సరికొత్త అపాచీ

చెన్నై: అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్‌ను టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మంగళవారం విడుదల చేసింది. ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ). దేశవ్యాప్తంగా టీవీఎస్‌ డీలర్లందరి వద్ద ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తెల్లటి ముత్యపు రంగులో లభ్యమయ్యే ఈ 159.7 సీసీ మోటార్‌ సైకిల్‌లో డ్యూయల్‌ టోన్‌ సీటు, అడ్జస్టబుల్‌ క్లచ్‌, బ్రేక్‌ లివర్స్‌, ముందువైపు రేడియల్‌ టైర్‌, ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌ లాంటివి ఉన్నాయి.  


ఎఫ్‌పీఐ, సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీ సలహా సంఘాల్లో మార్పులు

దిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు), సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సంబంధించి తన సలహా సంఘాల్లో మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ మార్పులు చేర్పులు చేసింది. 16 మంది సభ్యులుండే ఎఫ్‌పీఐ సలహా కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్‌ అథియా నేతృత్వం వహిస్తారు. అంతక్రితం మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ దీనికి నేతృత్వం వహించేవారు. ఆగస్టులో ఏర్పాటైన 15 మంది సభ్యుల కమిటీలో జేపీమోర్గాన్‌ చేస్‌ బ్యాంక్‌కు చెందిన మాధవ్‌ కల్యాణ్‌ ఒక సభ్యుడిగా ఉండగా.. ఆయన స్థానంలో జీఐసీ ఎండీ చూ హాయ్‌ జాంగ్‌; జేపీమోర్గాన్‌ (డైరెక్ట్‌ కస్టడీ, క్లియరింగ్‌) ఎండీ మైఖేల్‌ డ్రమ్‌గూల్‌ చేరతారు. 

* సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీ సలహా సంఘంలోకి సమున్నతి ఫైనాన్షియల్‌ ఇంటర్మీడియేషన్‌ సీఈఓ అనిల్‌ కుమార్‌; హెచ్‌సీఎల్‌ టెక్‌ గ్లోబల్‌ హెడ్‌  సంతోశ్‌ జయరామ్‌; గైడ్‌స్టార్‌ ఇండియా సీఈఓ పుష్ప అమన్‌ సింగ్‌; బిల్‌ రైర్సన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ఫౌండేషన్‌ ఎండీ హేమంత్‌గుప్తా చేరతారు. ప్రస్తుతమున్న మోహన్‌దాస్‌ పాయ్‌, రూపా కుద్వా, గిరీశ్‌ సొహానీలు వైదొలగుతారు. 18 మంది సభ్యులుండే ఈ కమిటీకి గ్రాస్‌రూట్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వొకసీ మూమెంట్‌ ఛైర్మన్‌ ఆర్‌ బాలసుబ్రమణియం నేతృత్వం వహిస్తారు.


అరుణోదయ హాస్పిటల్స్‌లో  కిమ్స్‌ హాస్పిటల్స్‌కు 65.62% వాటా  

 

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న అరుణోదయ హాస్పిటల్స్‌లో అదనంగా  7.79 శాతం వాటాను కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సొంతం చేసుకుంది. ఒక్కో షేరును రూ.370 ధరకు కొనుగోలు చేసినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. దీంతో అరుణోదయ హాస్పిటల్స్‌లో కిమ్స్‌ వాటా ఇంతకు ముందున్న 57.83% నుంచి 65.62 శాతానికి పెరిగింది. 200 పడకలున్న అరుణోదయ హాస్పిటల్స్‌ ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి వచ్చే రోగులకు సేవలు అందిస్తోంది.


రూ.350 కోట్లతో ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ సంస్థల కోసం సాక్సులను తయారు చేసే హైదరాబాదీ సంస్థ ఫిలాటెక్స్‌ ఫ్యాషన్స్‌ రూ.350 కోట్లతో తమ ప్లాంటును విస్తరించడంతోపాటు, సాక్సుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 లక్షల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మధుమేహులు, చిన్న పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక ఉత్పత్తులను అందిస్తున్నామని, త్వరలోనే ట్రాక్‌, టీషర్టుల విభాగాల్లోకి అడుగుపెడతామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాత్‌ సేథియా మంగళవారం ఇక్కడ చెప్పారు. ఏడాదిన్నరలో విస్తరణ పూర్తవుతుందని, మరో 1500-1700 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. శ్రీలంకలో ఏడాదికి 4.8 కోట్ల సాక్సులను ఉత్పత్తి చేసే ఇసాబెల్లాలో 51% వాటాను రూ.75 కోట్లతో కొనుగోలు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్లాంటు విస్తరణకు అవసరమైన 60 శాతం నిధుల కోసం ప్రిఫరెన్షియల్‌ షేర్లు జారీ చేయబోతున్నామని, 40 శాతం కంపెనీ నిధులను వెచ్చిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల టర్నోవర్‌, రూ.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తామనే అంచనాలున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని