అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే
వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
వృద్ధి, ద్రవ్యోల్బణం ఇక రాణిస్తాయ్
అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవు
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు కొనసాగడానికి సైతం తక్కువ అవకాశాలే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. దుబాయ్‌లో జరిగిన ఒక వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన దాస్ ఇంకా ఏమన్నారంటే..
తీవ్ర మాంద్యం రాదు..: 2023లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంచదగ్గరీతిలో క్షీణిస్తుందన్న అంచనాలు ఉన్నప్పటికీ.. అటు వృద్ధి.. ఇటు ద్రవ్యోల్బణం పరంగా అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే. వివిధ దేశాల్లో కరోనా సంబంధిత ఆంక్షలు తగ్గుతుండడం, ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుండడం కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను తగ్గించడం లేదా పెంపును పక్కనపెట్టడం చేయొచ్చు. అయితే కేంద్ర బ్యాంకులు తమ లక్ష్యాలకు చేరువగా ద్రవ్యోల్బణం దిగివచ్చేంత వరకు కృషి చేస్తాయి. అదే సమయంలో అధిక వడ్డీ రేట్లు మాత్రం ఎక్కువ కాలం పాటు కొనసాగించకపోవచ్చు. ఇక వృద్ధి విషయానికొస్తే.. కొద్ది నెలల కిందట అంచనా వేసినట్లు తీవ్ర మాంద్యం కాకుండా.. సరళ మాంద్యమే కనిపించే అవకాశం ఉంది.
మన మూలాలు బలంగానే..: భారత ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే.. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ మనం మాత్రం స్థిరంగా ఉన్నాం. మన స్థూల ఆర్థిక మూలాల నుంచి బలం అందుతోంది. మన బ్యాంకులు, కంపెనీలు సంక్షోభ సమయంలో కంటే మిన్నగా రాణిస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో వృద్ధి రెండంకెల స్థాయికి చేరింది. ప్రపంచ వృద్ధి మసకబారుతున్నా.. మనం మాత్రం వెలుగులీనుతున్నాం. మన ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉన్నా.. నవంబరు, డిసెంబరులో తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. 1990ల నుంచీ ఇప్పటి దాకా మన ఆర్థిక మార్కెట్లు రాణిస్తున్నాయి. గత దశాబ్దం కాలంగా అయితే మన ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ప్రగతిని సాధిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సవాళ్లను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం: ఇటీవలి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో మళ్లీ రక్షణాత్మక దోరణులు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిర్మించుకోవడం ఇపుడు అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ఇటీవల యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మరిన్ని ఒప్పందాలూ కుదరనున్నాయి. భవిష్యత్‌లో సవాళ్లు కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే మనం ఆశావహ దృక్పథం, ధీమాతో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన