మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ యథాతథంగానే

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌పై (ఎఫ్‌పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది.

Updated : 29 Jan 2023 03:03 IST

తేదీల్లో మార్పుల్లేవ్‌.. ఇష్యూ ధర తగ్గించబోం
ఊహాగానాలపై  అదానీ గ్రూపు స్పష్టత

ముంబయి: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌పై (ఎఫ్‌పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఇష్యూ ధర, తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అనుకున్న సమయానికే.. నిర్ణయించిన ధరల శ్రేణి ప్రకారమే ఎఫ్‌పీఓ జరుగుతుంద’ని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బీఎస్‌ఈ వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. ఎఫ్‌పీఓకు తొలి రోజున (శుక్రవారం) కేవలం 1 శాతం మాత్రమే స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4.55 కోట్ల షేర్లను విక్రయానికి   ఉంచగా.. 4.7 లక్షల షేర్లకే బిడ్‌లు దాఖలయ్యాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు పతనమైన నేపథ్యంలో.. ఇష్యూలో మార్పులు చేయాలని బ్యాంకర్లు అనుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇష్యూ సమయాన్ని పొడిగించడం లేదంటే ఇష్యూ ధరను తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఊహాగానాలపై పై విధంగా అదానీ గ్రూపు స్పష్టత ఇచ్చింది. ‘బ్యాంకర్లు, మదుపర్లు సహా మా వాటాదార్లందరూ ఎఫ్‌పీఓపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ ఇష్యూ విజయవంతం అవుతుందనే నమ్మకంతో మేం ఉన్నామ’ని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆరోపణలపై వివరణ ఇవ్వండి: ఎంఎస్‌సీఐ

షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ నివేదిక చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా అదానీ గ్రూపును సూచీల సంస్థ ఎంఎస్‌సీఐ అడిగింది. ‘నివేదికలోని అంశాలను సునిశితంగా పరిశీలిస్తున్నాం. ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ ఇన్వెస్టబుల్‌ మార్కెట్‌ సూచీలలో సంబంధిత షేర్ల అర్హతపై దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా గమనిస్తున్నామ’ని ఎంఎస్‌సీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై మార్కెట్‌ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్‌సీఐ స్టాండర్డ్‌ ఇండెక్స్‌లో అదానీ గ్రూపునకు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నివేదిక సంబంధించి ఏమైనా ప్రతికూల వివరణ అందితే.. ఎంఎస్‌సీఐ సూచీలో అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించడం లేదంటే తొలగించే అవకాశాలు ఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే షేర్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అదానీ గ్రూపునకు వివాదాలు కొత్త కాదు

అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే మాట వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్‌ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యకారుల నాయకులపై అదానీ గ్రూపు కేసు వేసింది. తాజాగా హిండెన్‌బర్గ్‌ నివేదిక రూపంలో మరో సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. సరిగ్గా అదానీ గ్రూపు ఎంటర్‌ప్రైజెస్‌ మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌కు ముందే ఈ నివేదిక వెలువడటం, గ్రూపు కంపెనీల షేర్లు పతనమవ్వడంతో.. ఈ సమస్యను ఎలా అధిగమించి ఎఫ్‌పీఓను విజయవంతం చేసుకుంటుందనే దానిపై ఇప్పుడు కార్పొరేట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌

అదానీ గ్రూపు కంపెనీల షేర్ల భారీ పతనం ప్రభావంతో ఆ కంపెనీలకు రుణాలిచ్చిన ఎస్‌బీఐ, వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ సంస్థలు మొత్తంగా రూ.78,000 కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రి, దర్యాప్తు సంస్థలు ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సుర్జేవాలా డిమాండు చేస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం షేర్లు పతనమైన తర్వాత కూడా అదానీ గ్రూపులో మళ్లీ రూ.300 కోట్లను ఎల్‌ఐసీ ఎందుకు పెట్టుబడిగా పెడుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఎన్‌డీటీవీకి శ్రీనివాసన్‌ జైన్‌ రాజీనామా

ఎన్‌డీటీవీకి రాజీనామా చేస్తున్నట్లు జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌ తెలిపారు. ‘ఎన్‌డీటీవీలో మూడు దశాబ్దాల పాటు అద్భుతంగా సాగిన నా ప్రయాణం నేటితో ముగిసింది. రాజీనామా తీసుకోవాలనే నిర్ణయం అంత సులభమైనది కాదు. కానీ తీసుకోవాల్సి వచ్చింద’ని ట్విటర్‌లో ఆయన తెలిపారు. ఎన్‌డీటీవీలో ప్రముఖ వ్యక్తుల్లో శ్రీనివాసన్‌ జైన్‌ ఒకరు. వీక్షకుల ఆదరణ పొందిన పలు కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని